హీరోగా సక్సెస్ కాకపోవడం వల్ల అనుకున్నంత గుర్తింపు రాలేదు కానీ.. తెలుగులో ఉన్న మేటి నటుల్లో బ్రహ్మాజీ ఒకడు. ‘సింధూరం’ సహా లీడ్ రోల్ చేసిన కొన్ని సినిమాల్లోనే బ్రహ్మాజీ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అదే సమయంలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా బ్రహ్మాజీ అదగరొట్టేస్తాడు.
వ్యక్తిగతంగా కూడా బ్రహ్మాజీది ఎంతో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సోషల్ మీడియాలో, బయట ఏదైనా ఫంక్షన్లు జరిగితే ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక బ్రహ్మాజీ వ్యక్తిగత జీవితం కూడా అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటుంది. ఆయన ఆల్రెడీ పెళ్లయి విడాకులు తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె బిడ్డనే తన బిడ్డగా స్వీకరించాడు.
తన భార్య పేరు శాశ్వతి. ఆమెతో బ్రహ్మాజీ ప్రయాణం ఎలా మొదలైందనే విషయంలో అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంది. వెన్నెల కిషోర్ నిర్వహించే ఒక టీవీ షోకు భార్యతో కలిసి హాజరైన బ్రహ్మాజీ ఈ జర్నీ గురించి చెప్పుకున్నాడు.
శాశ్వతితో కొన్నేళ్ల పాటు ప్రయాణం చేశాక తనను పెళ్లి చేసుకోవాలని అనిపించిందట. ముందు ప్రపోజ్ చేసింది కూడా బ్రహ్మాజీయేనట. పెళ్లి సమయానికి తాను ఇండస్ట్రీలో పెద్దగా స్థిరపడలేదని.. ఖర్చులకు కూడా డబ్బులు లేని స్థితిలో ఉన్నానని బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు.
తన పెళ్లి కూడా చిత్రమైన పరిస్థితుల్లో జరిగిందని అతను వెల్లడించాడు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా జరిగిందని.. కృష్ణవంశీ, గుణ్ణం గంగరాజు, రమ్యకృష్ణ లాంటి కొద్ది మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారని బ్రహ్మాజీ తెలిపాడు. కృష్ణవంశీ, రమ్యకృష్ణలే దగ్గరుండి పెళ్లి చేశారని.. తన పెళ్లికి కన్యాదానం చేసింది కృష్ణవంశీయే అని అతను చెప్పాడు.
తమ పెళ్లి జరుగుతున్నపుడే ‘చంద్రలేఖ’ షూటింగ్ జరుగుతుండటంతో ఆ టీంలో ఉన్న వాళ్లంతా ఉదయం 8 గంటలకే ఆర్య సమాజ్‌కు వచ్చి తమ పెళ్లి జరిపించారని.. అనంతపురంలో తన సినిమా షూటింగ్ కోసం రావాలని మోహన్ బాబు చెప్పడంతో పెళ్లయిన వెంటనే ఆయన పంపిన కారులో అనంతపురం వెళ్లి.. మూడు రోజుల తర్వాత తిరిగొచ్చినట్లు బ్రహ్మాజీ వెల్లడించాడు.
పెళ్లయిన వెంటనే షూటింగ్‌కు రావడంతో తనతో పాటు ఆ రోజు గదిని పంచుకున్న ఏవీఎస్.. నీ ఫస్ట్ నైట్ నాతోనే అని చమత్కరించినట్లు బ్రహ్మాజీ వెల్లడించాడు. విడాకులు అయిన అమ్మాయితో పెళ్లి కావడంతో తన ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పలేదని.. కొన్ని రోజులకు క్యాజువల్‌గా ఫోన్ చేసి విషయం చెబితే చాలా బాధపడ్డారని.. చెప్పి చేసుకోవాల్సింది అన్నారని.. అంతకుమించి అభ్యంతర పెట్టలేదని బ్రహ్మాజీ తెలిపాడు.