జగన్ కేబినెట్లో మంచి ప్రయారిటీ ఉన్న ఇద్దరు మంత్రులలో బొత్స సత్యనారాయణ ఒకరు. రాజకీయంగా విజయనగరం జిల్లాలో పట్టున్న నేత కావడం, విజయనగరం జిల్లాలో టీడీపీ నేత అశోక్ గజపతి రాజు ప్రభావాన్నిచాలావరకు తగ్గించగలగడంతో జగన్ ఆయనకు ప్రయారిటీ ఇస్తుంటారు.
అదే కాకుండా కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడం.. జిల్లా మొత్తం ఆయన కుటుంబీకులే చాలావరకు పదవుల్లో ఉండడంతో ఆయనకు ప్రయారిటీ దొరుకుతోంది. జగన్ కేబినెట్లో కీలకమైన విద్యాశాఖ ఆయన చేతిలోనే ఉంది.
ఇప్పుడు బొత్స విజయనగరం నుంచి విశాఖపట్నానికి ట్రాన్సఫర్ అవుతున్నారని వైసీపీలో వినిపిస్తోంది.
బొత్స ప్రస్తుతం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈసారి ఆయన విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బొత్సా సతీమణి మాజీ ఎంపీ ఝాన్సీని వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ లోక్ సభ అభ్యర్ధిగా అధిష్టానం ఎంపిక చేసింది.
ఆమె ఇప్పటికే విశాఖ పార్లమెంటు పరిధిలో ప్రచారాన్నిప్రారంభించి సన్నిహితులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీచేస్తున్న సమయంలో భర్త బొత్స విశాఖకు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే చీపురుపల్లి నుంచి తిరిగి పోటీ చేయించడం సమంజసం కాదనే అభిప్రాయానికి పార్టీ అధిష్టానం వచ్చినట్లు తెలిసింది.
భార్యతో పాటు భర్త కూడా విశాఖ పార్లమెంటు పరిధిలో పోటీ చేయడం మంచిదనే అభిప్రాయానికి పార్టీ వచ్చింది.
ఈ కారణంగా విజయనగరం జిల్లాను ఆనుకొని వుండి, కాపు సామాజిక వర్గానికి బలమైన భీమునిపట్నంను ఎంపిక చేసినట్లు తెలిసింది.
భీమిలి నియోజక వర్గ పరిధి విశాఖ నగరం వరకూ ఉంది. సిటీలో భాగమైన సాగర్ నగర్, మధురవాడ, సింహాచలం భీమిలిలో ఉన్నాయి. కొద్ది సంవత్సరాలుగా బొత్స కుటుంబం విశాఖలోనే నివాసం ఉంటుంది.
ఈ నేపధ్యంలో బొత్స సత్యానారాయణను భీమిలి నుంచి బరిలోకి దించితే లోక్ సభ అభ్యర్ధి విజయావకాశాలు మరింతగా పెరుగుతాయని అధిష్టానం అంచనాకు వచ్చింది.
రాజ్యసభ ఎన్నికల పోలింగ్ తరువాత ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని తెలిసింది.
ప్రస్తుత భీమిలి శాసనసభ్యడు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ని ఆ పక్కనే ఉండే నెల్లిమర్లకు మార్చనున్నారని తెలిసింది.
ప్రస్తుతం బొత్సా మేనల్లుడు బడ్డుకొండ అప్పల నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
విపరీతమైన సెటిల్మెంట్లు, పర్సంటేజీలు, బలవంతపు వసూళ్ల కారణంగా నియోజకవర్గంలో బాగా చెడ్డ పేరు వచ్చినట్లు తెలుస్తోంది. సర్వేల్లో కూడా ఆయన విజయం కష్ణమని నివేదికలు వచ్చాయి.
ఈ నేపధ్యంలో అవంతి శ్రీనివాస్‌ను అక్కడకు పంపించాలని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది.
ఆ నియోజక వర్గంలో బొత్స పలుకుపడి ఉంటుందని, అవసరమైతే ఆయనతో ప్రచారం చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
జగన్ సీఎం అయిన తరువాత వైజాగ్, ఉత్తరాంధ్రలో రాయలసీమ రెడ్ల ప్రభావం పెరిగింది. విజయసాయిరెడ్డి వైజాగ్ కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి కూాాడా ఇక్కడ వ్యవహారాలలో ఇన్వాల్వ్ అవుతుంటారు. వీరేకాదు.. చాలామంది రాయలసీమ రెడ్లు ఇక్కడ వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తున్నారు. దీంతో వైజాగ్ రాయలసీమ ప్రభావానికి లోనయిందన్న భావన ఇక్కడ కొద్దికాలంగా ఉంది.
అయితే.. ఇప్పుడు బొత్స వైజాగ్ లోకి ఎంట్రీ ఇస్తుండడంతో వైజాగ్ మళ్లీ ఉత్తరాంధ్రులు చేతికి వస్తుందన్న భావన కల్పించడానికి ఈ ఎత్తుగడ వేస్తున్నట్లుగా చెప్తున్నారు.