జగన్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని, మద్య నిషేధం విధిస్తామన్న జగన్… మహిళలను మోసం చేశారని టీడీపీ నేతలు చాలాకాలంగా దుయ్యబడుతున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదని, రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా జగన్ తేలేదని మండిపడ్డారు. అంతేకాదు, జగన్ పాలనకు భయపడి పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు, భూకబ్జాలే కనిపిస్తున్నాయని ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ విమర్శలు గుప్పించారు. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీకి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తొమ్మిది సార్లు దావోస్ ఆర్థిక సదస్సుకు వెళ్లారని, వెళ్లిన ప్రతిసారి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి తెచ్చారని అన్నారు.
దావోస్ సదస్సులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారని, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు తీసుకెళ్తున్నారని అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత ఒకసారి మాత్రమే దావోస్ కు వెళ్ళారని, ఈసారి ఎందుకు వెళ్ళలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల పాలనలో ఏపీకి జగన్ పిచ్చి మందు, ఫిష్ మార్కెట్ మాత్రమే తీసుకురాగలిగారని, జగన్ అవినీతి దెబ్బకు ఏపీకి పారిశ్రామికవేత్తలు రావాలంటేనే భయపడుతున్నారని ఆరోపించారు. ఈ సారి సదస్సుకు ఏపీ తరఫున ఏ మంత్రి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి కోడిపందాలు, పేకాట ఆడుతూ బిజీగా ఉన్నారని విమర్శలు గుప్పించారు.