ఏపీలో ఒక్క రాజధానికే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 27న కేంద్ర హోంశాఖ సమావేశంకానుంది. విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్రం సహకారంపై సమావేశంలో చర్చించనున్నారు. `కొత్త రాజధానికి నిధులు` అని మాత్రమే కేంద్ర హోంశాఖ అజెండాలో తెలిపింది.
మూడు రాజధానులపై అజెండాలో ప్రస్తావన లేదు. అలాగని.. కేవలం తాము ఇచ్చే నిధులను అమరావతికే ఖర్చు చేయాలని.. అలా చేయకపోతే.. చర్యలు తప్పవని కూడా హెచ్చరించలేదు. దీంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలపై అనుమానాలు వస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
ఇక, రాష్ట్రంలో వైసీపీ నాయకులు, మంత్రులు.. పదే పదే మూడు రాజధానులని చెబుతున్నారు. దీనిని ఎవరూ ఆపలేరని కూ డా అంటున్నారు. గతంలో ఏపీ హైకోర్టు.. రాజధానిగా అమరావతే ఉంటుందని తీర్పు ఇచ్చినప్పటికీ.. మూడు మాసాల్లోనే రైతులకు న్యాయం చేయాలని.. సకల వసతులతో వారికి ఫ్లాట్లు అప్పగించాలని.. ఆదేశించినప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు ఈ నెల 15 నుంచి ప్రారంభంకాబోతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులకు సంబంధించి బిల్లు పెడతామని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే.. అమరావతినే రాజధాని చేయాలంటూ.. అక్కడి రైతులు మలివిడత మహాపాదయాత్ర చేస్తున్నారు. అంటే.. ఇటు రైతులు-అటు బీజేపీ-మరోవైపు వైసీపీ ప్రభుత్వం వెరసి.. రాజధానిపై దూకుడు ఎటు దారితీస్తుందనేది.. ఆసక్తిగా మారింది. తాజాగా కేంద్రం చేసిన ప్రకటన రాజకీయ కోణంలోనే చూడాల్సి వస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఎందుకంటే.. ఈ ప్రకటనలో స్పష్టత కనిపించడం లేదని, ఒక రాజధానికి నిధులు ఇస్తామని మాత్రమే కేంద్రం చెప్పిందని అంటున్నారు. అయితే.. ఈ ఒక్కరాజధాని ఏది? అమరావతేనా? ! అనేది ఇప్పుడు ప్రశ్న.
నిజానికి అమరావతికి నిధులు ఇవ్వాలని భావిస్తే.. స్పష్టంగా ఆ పేరుతో ఇచ్చేస్తే.. ఏ ఘర్షణా ఉండదు. లేకపోతే.. ఒక రాజధానికి నిధులు అంటే.. వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం మరోసారి ఆయుధాలు ఇచ్చినట్టేనని అంటున్నారు. ఈ నిధులను మూడు రాజధానులకు ఖర్చు చేయొద్దని కేంద్రం చెప్పలేదు కదా! అనే లా పాయింట్లు తీసే నాయకులు వైసీపీలో కోకొల్లలుగా ఉన్నారు.
మరోవైపు.. అమరావతికి ఇటీవల కాలంలో బీజేపీ అనుకూలంగా మారిందనే వాదన ఉంది. దీంతో ఇప్పుడు ఆ నిధులు తమ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమరావతికే ఇచ్చిందని.. స్థానిక నేతలు.. రాజకీయంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఇది.. ఎలా చూసినా.. ఒక సరికొత్త వివాదానికి దారితీయడం.. ఖాయమని అంటున్నారు పరిశీలకులు.