బీజేపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు, లాయర్, ఫైర్ బ్రాండ్ నేత సుబ్రమణ్య స్వామి గురించి భారత దేశ ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం ఆయన ప్రత్యేకత. స్వపక్షం, ప్రతిపక్షం, తన, మన తారతమ్యాలు లేకుండా…నిర్మొహమాటంగా వ్యాఖ్యానించడం ఆయన నైజం. రక్షణ మంత్రి అయినా సరే కుండబద్దలు కొట్టినట్లు విమర్శించడం ఆయన స్వభావం.
ఈ క్రమంలోనే తాజాగా సాక్ష్యాత్తూ ప్రధాని మోదీపై తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల క్రితం ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని స్వామి ట్విటర్లో సెటైర్లు వేశారు. 2017 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలనుద్దేశించి మోదీ ఇచ్చిన హామీలను స్వామి గుర్తు చేశారు. అంతేకాదు, ఈ ఏడాది ఆగస్టు 15న మోదీ తన ప్రసంగంలో ఏమేం హామీలు ఇస్తారోనంటూ చురకలంటించారు.
2022 ఆగస్టు 15 నాటికి దేశ ప్రజలందరికీ సొంత ఇళ్లు, ప్రతి ఏటా 20 కోట్ల ఉద్యోగాలు, బుల్లెట్ ట్రైన్, రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తాననడం… అవన్ని హామీలు నెరవేరాయా? అని ప్రశ్నించారు. మరి, స్వామి కామెంట్లపై బీజేపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. మామూలుగా అయితే, విపక్ష నేతలు మోదీపై కామెంట్ చేసి చేయగానే కౌంటర్లు ఇచ్చే బీజేపీ నేతలు…గతంలో కూడా స్వామిపై కౌంటర్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏది ఏమైనా, మోదీపై సుబ్రహ్మణ్య స్వామి సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.