నేటి నుంచి ఏపీ, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గందరగోళం మధ్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ రెండు సమావేశాల సందర్భంగా గందరగోళానికి ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్ లే కేంద్ర బిందువులుగా మారారని అనిపిస్తోంది. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్…జగన్ సర్కారుకు వత్తాసు పలుకుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభనుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక, తెలంగాణ గవర్నర్ తమిళిసైని బడ్జెట్ ప్రసంగానికి ఆహ్వానించకుండానే అక్కడి అధికార పార్టీ అవమానించిందని బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ లపై స్పీకర్ సస్పెన్షన్ వేటు పడింది. ఏపీలో టీడీపీ సభ్యులు సభనుంచి వాకౌట్ చేస్తే…తెలంగాణలో బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. తెలంగాణ గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించడాన్ని ఈటల, రాజాసింగ్, రఘునందన్ తప్పుబట్టారు. 50 ఏళ్ల సంప్రదాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారని, కేసీఆర్కు సీఎంగా కొనసాగే హక్కు లేదని అసెంబ్లీలో నినాదాలు చేశారు. దీంతో, ఈ సెషన్ పూర్తయ్యే వరకు వారిపై సస్పెన్షన్ విధించారు.
తమను అణిచివేయడం సాధ్యం కాదని ఈటల అన్నారు. తమ మైకులు కట్ చేసి, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేసీఆర్ గంటల కొద్దీ మాట్లాడారని, ఇపుడు నియంతలా మారారని దుయ్యబట్టారు. అనంతరం, కేసీఆర్, ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ ముందు ఈటల, రాజా సింగ్, రఘునందన్ నిరసనకు దిగారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఆ ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు.