తెలంగాణలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నేత రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహమ్మద్ ప్రవక్తపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ పై హైదరాబాద్ లోని చాలా స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోని రాజా సింగ్ అరెస్టు సందర్భంగా ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు బలగాలని మోహరించారు. ఓ మతాన్ని కించపరిచేలా రాజాసింగ్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో పై ఎంఐఎం పార్టీ నేతలు కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు.
తమ మనోభావాలు దెబ్బతీశారంటూ పలు పోలీస్ స్టేషన్ ల ఎదుట ఎంఐఎం పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు మహమ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, మహమ్మద్ ప్రవక్తను ఆయనను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తున్నారు. రాజా సింగ్ వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఎంఐఎం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే తన అరెస్ట్ పై రాజాసింగ్ స్పందించారు.
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షోను హైదరాబాద్ లో నిర్వహించవద్దని తాను చెప్పానని, దానిని పోలీసులు పట్టించుకోలేదని రాజాసింగ్ ఆరోపించారు. అతడికి విఐపి రేంజ్ లో భద్రత కల్పించి మరీ షో నిర్వహించారని మండిపడ్డారు. తాను దండం పెట్టినా పోలీసులు వినలేదని, రాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని నిలదీశారు. ఫారూఖీ వీడియోలకు కౌంటర్ వీడియోలు చేస్తానని తాను ముందే చెప్పానని అన్నారు.
అయితే, ఆల్రెడీ తాను అప్ లోడ్ చేసిన మొదటి కౌంటర్ వీడియోని యూట్యూబ్ తొలగించిందని అన్నారు. అయితే, రెండో వీడియోను కూడా త్వరలో అప్లోడ్ చేస్తానని, యాక్షన్ కు రియాక్షన్ తప్పదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ధర్మం కోసం తాను చావడానికి సిద్ధమని చెప్పారు. హిందూ దేవుళ్లను కించపరిస్తే ఉపేక్షించేది లేదని రాజాసింగ్ హెచ్చరించారు. అయితే, హిందూ దేవుళ్లను కించపరిచే వ్యక్తులకు రక్షణ కల్పించే పోలీసులు తనపై మాత్రం కేసులు నమోదు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.