ఏపీ అధికార పార్టీ వైసీపీపై బీజేపీ తీవ్రస్తాయిలో నిప్పులు చెరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా విప్పేసి హల్చల్ చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. మీరు బట్టలిప్పడం కాదు.. ప్రజలే మీ బట్టలు విప్పే రోజు 2024లో దగ్గర పడుతోందని ఆయన సంచలన కామెంట్లు చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడి చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మంత్రి హోదాలో బట్టలు విప్పి సవాల్ విసరడం సిగ్గు చేటన్నారు.
‘‘మీరు బట్టలు విప్పడం కాదు.. 2024లో ప్రజలే మీ బట్టలు విప్పే పరిస్థితి వస్తుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 2024లో నూటికి నూరు శాతం వైసీపీ ఓటమి ఖాయమని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. సీఎం మెప్పు పొందడానికే మంత్రులు ఇలా ప్రవర్తిస్తున్నారన్నారు. ‘‘ఈరోజు మంత్రి షర్ట్ విప్పితే, రేపు ఇంకో మంత్రి ప్యాంటు విప్పుతాడు, మరోసారి ఇంకో మంత్రి బట్టలన్నీ విప్పుతాడు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉందో చెప్పాలంటే నేనే ఉదాహరణ. ఒకప్పుడు రోలెక్స్ వాచి వాడేవాడిని.. ఇప్పుడు నార్మల్ వాచి స్థాయికి దిగిపోయాను’’ అంటూ విష్ణుకుమార్ రాజు చెప్పారు.
ఏం జరిగిందంటే
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేం ఖర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మంత్రి ఆదిమూలపు సురేష్ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కాన్వాయ్‌పై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి తెగబడ్డారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ స్వయంగా ముందుండి తన పార్టీ శ్రేణులను ఉసిగొల్పారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నల్ల దుస్తులు ధరించిన మంత్రి.. చొక్కా విప్పి అర్ధనగ్నంగా రోడ్డుపై హల్చల్ చేశారు.
దమ్ముంటే ఎవరైనా రండని సవాల్ విసురుతూ వీరావేశం ప్రదర్శించారు. బాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడికి వైసీపీ శ్రేణులు యత్నించగా… ఎస్ఎన్జీ కమేండోలు చుట్టూ రక్షణ కవచంగా నిలిచారు. ఈ క్రమంలో కమాండెంట్ సంతో్‌షకుమార్ తలకు రాయి తగిలి గాయమైంది. దీనిపై పార్టీలకు అతీతంగా వైసీపీయేతర పార్టీలన్నీ స్పందిస్తున్నాయి. వైసీపీ మంత్రి వ్యవహరించిన తీరును తప్పుబడుతున్నాయి.