ఏపీలో టీడీపీ-జనసేనల మధ్య పొత్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ రెండు పార్టీలు బీజేపీతో కూడా కలిస్తే వైసీపీని గద్దె దించడం సులువని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ పెద్దలతో వారిద్దరూ పొత్తులపై కీలక చర్చలు జరుపుతున్నారు. ఇటువంటి క్రమంలోనే పొత్తులపై ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లు పొత్తులకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. ఏపీకి బీజేపీ నేతే సీఎం కావాలి అంటూ ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఏపీలో బీజేపీ నేతే సీఎం కావాలని, ఏపీలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆయన అన్నారు. ఎవరినో మా భుజాల మీద ఎక్కించుకొని పనిచేసే అవసరం మాకు లేదు అంటూ టీడీపీపై పరోక్షంగా విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న బలమైన వ్యక్తి అయినా…ఈ రోజు ఆ పరిస్థితి లేదు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. 2014లో బీజేపీ బలం వేరు…ఈ రోజు 2024లో బలం వేరని, ఎవరి అపాయిట్మెంట్ లు ఎవరు కోరుతున్నారో చూడాలని విమర్శించారు.
ఏపీలో బీజేపీకి శక్తి లేదని కొందరు అంటున్నారని, అయితే ఏపీలో బీజేపీతో పొత్తు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను చంద్రబాబు కలిశారని, కానీ, షా తో మీటింగ్ లో ఏం జరిగిందో చంద్రబాబు కూడా చెప్పలేదు…అమిత్ షా కూడా చెప్పలేదు అని వ్యాఖ్యానించారు. దీంతో, విష్ణువర్థన్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
ఏపీలో బీజేపీకి 1 శాతం ఓటు షేర్ ఉందని, ఆ ఒక్క శాతం ఓట్లతో ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ దక్కించుకోగలదా విష్ణు రెడ్డీ…? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డికి విష్ణు రెడ్డికి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, ఆయన మాయలో పడి సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్న బీజేపీ రెడ్డికి చీవాట్లు తప్పవు అని ట్రోల్ చేస్తున్నారు.