రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్ల విషయంలో కమలం పార్టీ బీజేపీ బాగా అలర్టైనట్లే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతృత్వంలో దొంగ ఓట్లు చేరుతున్నాయని, ముఖ్యంగా ఈ సమస్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాల ఎక్కువగా ఉందని బీజేపీ నేతలు గోల చేస్తున్నారు. ఇదే విషయమే గతంలోనే చీఫ్ ఎలక్షన్ కమీషనర్ కు ఫిర్యాదు కూడా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిపక్షాలకు ముఖ్యంగా బీజేపీకి పడతాయని అనుమానించన ఓట్లను తొలగించటమే కాకుండా తమకు అనుకూలంగా అధికార పార్టీ బోగస్ ఓట్లను చేరుస్తున్నట్లు కమలనాథులు గగ్గోలు పెడుతున్నారు.
దొంగఓట్లను ఏరేయటంలో పార్టీ యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని అగ్రనేతలు నియోజకవర్గాల నేతలకు, గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేటర్లను అలర్ట్ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి వాస్తవంగా ఉన్న ఓటర్ల జాబితాలను సేకరించాలని, ఆ వివరాలను ఎన్నికల కమీషన్ కు అందించేట్లుగా చర్యలు తీసుకోవాలని బీజేపీ కొత్త చీఫ్ కిషన్ రెడ్డి పదేపదే నేతలకు చెబుతున్నారు. దొంగఓట్ల నమోదులో బీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కీలక అధికారి సహకారం అందిస్తున్నట్లు ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు కూడా చేశారు.
పోలింగ్ కేంద్రాల పరిధిలో స్ధానికుల ఓట్లను తీసేసి స్ధానికేతరుల ఓట్లను నమోదచేయిస్తున్నట్లు బీజేపీ నేతలు మండిపోతున్నారు. అలాగే ఒక పోలింగ్ కేంద్రంలోని ఓటర్లను దూరంగా ఇంకెక్కడో ఉండే పోలింగ్ కేంద్రాల్లో కేటాయిస్తున్నట్లు ఆరోపించారు. దీనివల్ల ఓట్లు వేయటంలో పెద్ద ఆసక్తి చూపించరని కిషన్ ఆరోపిస్తున్నారు. ఓటింగ్ కు రాని ఓటర్ల వివరాలు తెలుసుకుని అవకాశం దొరకగానే బీఆర్ఎస్ నేతలు దొంగోట్లు వేయించుకునే ప్లానులో ఉన్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది.
అందుకనే పార్టీ యంత్రాంగం ద్వారా ముందుగా నియోజకవర్గాల వారీగా, గ్రేటర్ పరిధిలో అయితే డివిజన్ల వారీగా వాస్తవ ఓటర్ల వివరాలను సేకరిస్తోంది బీజేపీ. ఓటర్ల వాస్తవ జాబితాలను రెడీచేసి ఆ వివరాలను కమీషన్ కు ఇవ్వాలనే ప్లానులో ఉన్నారు. తమ వెరిఫికేషన్లో యాకత్ పుర నియోజకవర్గంలో సుమారు 79 వేల ఓట్లు బోగస్ విగా గుర్తించినట్లు చెప్పారు. చంద్రాయణగుట్టలో 79 వేలు, చార్మినార్ సెగ్మెంట్లో 42 వేలు, కార్వాన్లో 83 వేల ఓట్లు దొంగఓట్లుగా గుర్తించినట్లు కిషన్ చెబుతున్నారు.