వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల లో రాజకీయాలు మారుతున్నాయి. ఇక్కడ తాము తప్ప.. ఇంకెవరికీ చోటు ఉండదని భావించిన వైసీపీకి.. ఇప్పుడు చుక్కలు కనిపించే పరిస్థి తులు ఎదురవుతున్నాయి. నిజానికి ఆది నుంచి కూడా.. వైఎస్ కుటుంబంతోనే ఇక్కడ రాజకీయాలు సాగుతున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా.. ఈ కుటుంబానికే ప్రజలు పట్టం కడుతున్నారు. అయితే.. ఇప్పు డు పరిస్థితి మారిపోతోంది.
నియోజకవర్గంలో టీడీపీ పుంజుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. బీటెక్ రవి తాలూకు.. దూకుడు కూడా పెరుగుతోంది. దీంతో వైఎస్ కుటుంబానికి బలంగా ఉన్న ఓటు బ్యాంకు కదలిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా.. పులివెందులలో గ్యాడ్యుయేట్లు వైసీపీని దూరం పెట్టారు. ఇక ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలిచినా.. 2019తో పోల్చుకుంటే ఆయనకు మెజారిటీ ఓట్లు తగ్గాయి.
సో.. మార్పు దిశగా అయితే పులివెందుల రాజకీయాలు దూకుడుగానే ముందుకు సాగుతున్నాయి. దీనిపై వైసీపీ నాయకులు ఒకింత ఆలోచన చేస్తున్నా.. పార్టీ అధినేత జగన్ మాత్రం ఎక్కడా ఆలోచన చేయక పోవడం గమనార్హం. తాజాగా జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లోనూ.. ఇక్కడ టీడీపీ మద్దతు దారులు విజయం దక్కించుకున్నారు. 32 సాగునీటి సంఘాలు ఉంటే.. 32 కూడా.. టీడీపీ ఖాతాలో పడ్డాయి. కనీసంలో కనీసం ఒకటో రెండో కూడా.. వైసీపీకి దక్కలేదు.
ఇక, బకారాపురం వైఎస్ పుట్టి పెరిగిన ప్రాంతం . ఇక్కడకూడా సాగునీటి సంఘాలు అన్నీ కూడా.. టీడీపీ కి దక్కాయి. దీనికి బీటెక్ రవి క్షేత్రస్థాయిలో చక్రం తిప్పడమేనని తెలిసింది. మున్ముందు ఇదే దూకుడు పనిచేస్తే.. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని ఇక్కడ ఓడించడమో .. లేక కనీస మార్కులతో గెలిచేలా చేయడమో జరగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. పులివెందులతో పోల్చుకుంటే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో కొంత బెటర్‌గా పరిస్థితి ఉండడం గమనార్హం.