బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసులో స్కామ్ జరిగిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పటి మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా నిధులు విదేశాలకు బదిలీ చేశారని ఆయనపై ఏసీబీ కేసు నమోదైంది. అయితే, తనపై కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. దీంతో, కేటీఆర్ కు నేటి వరకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది.
ఈ క్రమంలోనే తాజాగా ఆ బెయిల్ గడువును డిసెంబర్ 31వరకు తెలంగాణ హైకోర్టు పొడిగించింది. ఆ క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం నాడు విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్టు చేయకూడదని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. అయితే, విచారణ కొనసాగించవచ్చని ఏసీబీ అధికారులకు తెలిపింది. కేటీఆర్‌కు బెయిల్ మంజూరు చేసినా, రిలీఫ్ ఇచ్చినా, నాట్ టు అరెస్ట్ ఇచ్చినా విచారణకు ఇబ్బంది అని చెప్పింది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దన్న ఆదేశాలను రద్దు చేయాలని కోర్టును ఏసీబీ కోరగా…న్యాయమూర్తి తోసిపుచ్చారు.
ఈ పిటిషన్‌కు సంబంధించి కేటీఆర్, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నెల 30 వరకు ఉన్న నాట్ టు అరెస్ట్‌ను..31 వరకు హైకోర్టు ధర్మాసనం పొడిగించింది. ఈ నెల 31న నాట్ టు అరెస్ట్ పిటిషన్‌పై, ఫార్ములా ఈ రేసింగ్‌కు సంబంధించి నమోదైన కౌంటర్‌పై కూడా హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది. డిసెంబర్ 31న కేటీఆర్ విషయంలో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకోనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.