వైసీపీ నాయకుడు, మంత్రి కొడాలి నానికి కష్టాలు మొదలయ్యాయా? ఎన్నడూ లేని విధంగా ఆయనకు ఒకదాని వెంట ఒకటిగా ఘోరపరాభవాలు ఎదురవుతున్నాయా? అంటే.. తాజా పరిణామాలను గమనించి న వారు ఔననే అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మంత్రికి తీవ్ర నిర్బంధం ఎదురైంది. ఆయన చేసిన విమర్శలు, ఎన్నికల కమిషనర్‌పై నోరు పారేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ఆయనను మీడియాకు దూరంగా ఉండాలని ఆదేశించిన ఎన్నికల కమిషనర్.. ఏకంగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రిగారి పరిస్థితి దారుణంగా తయారైంది.
ఇక, మరోవైపు రాజకీయంగా ఆయన దూకుడుకు భారీ బ్రేకులు పడ్డాయి. మంత్రి కొడాలి నానికి సొంత ఊరిలోనే చేదు అనుభవం ఎదురైంది. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలోని నాని సొంత గ్రామం యలమర్రు పంచాయతీలో టీడీపీ మద్దతుదారైన సర్పంచ్ అభ్యర్థి కొల్లూరి అనూష 271 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 12 వార్డుల్లో 11 వార్డులను టీడీపీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. మిగిలిన ఒక్క వార్డులోనూ వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలవడం గమనార్హం. ఈ గెలుపుపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. నిజంగా ఇది నానికి ఊహించని షాక్ అని విశ్లేషకులు చెబుతున్నారు.
అదేసమయంలో కొడాని నాని నియోజకవర్గం కిందకు వచ్చే.. టీడీపీ వ్యవస్థాపక అధినేత ఎన్టీఆర్ స్వగ్రామంలో నిమ్మకూరులో సర్పంచ్ స్థానాన్ని టీడీపీ బలపరిచిన పడమట దుర్గా శ్రీనివాసరావు 121 ఓట్లతో కైవసం చేసుకున్నారు. ఈ పరిణామాలతో నాని ప్రభావం తగ్గిపోయిందనే టాక్ జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. మరోవైపు.. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపు రం మండలం హసన్‌బాదలో వైసీపీ మద్దతుతో పోటీచేసిన అభ్యర్థి గొల్లపల్లి పార్వతి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా.. వైసీపీ కీలక నేతల దూకుడుకు ప్రజలు బ్రేకులు వేశారనే విశ్లేషణలు రావడం గమనార్హం.