సోనియాగాంధీ ఆఫర్ కు షర్మిల ఎలా రియాక్టు అయ్యారు

తెర మీద కనిపించే బొమ్మకు.. తెర వెనుక జరిగే అంశాలకు ఏ మాత్రం పొంతన ఉండదు. అందునా రాజకీయాల్లో అలాంటివి ఎక్కువ. తన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయటానికి విపరీతంగా కసరత్తు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. చివరకు వాతావరణం ఏ మాత్రం తనకు అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించి.. తానే పదేళ్ల వరకు సీఎం అని.. ఈ అంశంపై ఎవరైనా మాట్లాడితే.. ఒక్కటిస్తానని.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని హెచ్చరించటం తెలిసిందే.
కేటీఆర్ ను సీఎం చేయటానికి ఫాంహౌస్ లో జరిగిన కసరత్తు.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఏవీ బయటకు రాలేదు. ఇవాళ కాకుంటే రేపు.. ఇలాంటివి కచ్ఛితంగా బయటకు రావటం ఖాయం. తాజాగా అలాంటి సంచలన అంశం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. అయితే.. ఈ విషయాన్ని వెల్లడించింది ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే కావటం గమనార్హం.
కీలకమైన రాజకీయ పరిణామాల్ని.. తెర వెనుక జరిగిన అసలు వాస్తవాల్ని సందర్భానికి తగినట్లుగా బయటకు చెప్పే అలవాటు ఆయనకు ఉంది. తాజాగా తన కాలమ్ లో ఆయన మరో సంచలన అంశాల్ని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా రాజన్న కుమార్తె షర్మిలకు ఫోన్ చేశారని.. ఊహించని ఆఫర్ ఆమె ముందు పెట్టినట్లుగా పేర్కొన్నారు. అదేమిటన్నది ఆయన మాటల్లోనే చెబితే..
‘‘గతంలో జగన్‌ జైలుకు వెళ్లినప్పుడు వైసీపీ అసలు నిలబడుతుందా? అని పార్టీ నాయకులు, కార్యకర్తలూ సందేహపడుతున్నప్పుడు అన్న ఆదేశాల మేరకు మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించిన తాను ఇప్పుడు పనికిరాకుండా పోవడం ఏమిటని షర్మిల వాపోతున్నారు. ‘మా అన్న నుంచి నన్ను దూరం చేయడం కోసం 2011లో సోనియాగాంధీ ఫోన్‌ చేసి కాంగ్రెస్‌ పార్టీతో చేయి కలిపితే ముఖ్యమంత్రి పదవి ఇస్తానని నాకు హామీ ఇచ్చినా తిరస్కరించా. ఈ విషయం జగన్‌తో పాటు మా అమ్మ విజయమ్మకు కూడా తెలుసు’ అని ఆమె తన బంధువుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది’’
‘‘జగన్‌ జైలులో నాలుగు గోడలకే పరిమితం అయినప్పుడు, భారతీరెడ్డి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటుండగా, తన బిడ్డలకు దూరంగా ఎండనకా వాననకా పాదయాత్ర చేసిన తనకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవమానం, నిర్లక్ష్యం, చులకనభావం, పక్షపాతమే మిగిలాయని, సొంత చెల్లికి జగన్‌ ఇచ్చిన బహుమతి ఇదా? అని షర్మిల మనస్తాపం చెందుతున్నారు’’
‘‘సొంత చెల్లెలికే ఈ గతి పడితే, రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు జగన్‌ మాటలను ఎందుకు విశ్వసించాలి? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. తాను తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నానని తెలిసిన వెంటనే జగన్‌ మంత్రివర్గంలోని ముఖ్యులకు బిల్లుల చెల్లింపును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలిపివేసింది నిజం కాదా? దీంతో ఆందోళన చెందిన జగన్‌ సంజాయిషీ ఇచ్చుకోలేదా? అని ఆమె నిలదీస్తున్నారు’’
‘‘రాజశేఖర్‌ రెడ్డి లక్షణాలు పుణికిపుచ్చుకున్న తాను మాట తప్పననీ, ఆ విషయం జగన్‌తో పాటు కుటుంబ సభ్యులు అందరికీ తెలుసుననీ, ఈ కారణంగా రానున్న రోజులలో తన విశ్వసనీయత పెరిగి ఆయన విశ్వసనీయత పాతాళానికి పడిపోతుందన్న భయం సోదరుడు జగన్‌కు పట్టుకుందని షర్మిల వ్యాఖ్యానించినట్టుగా కుటుంబ శ్రేయోభిలాషులు చెబుతున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ముదురుతున్న విభేదాల విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఖ్యమైన వైసీపీ నాయకులు కొందరు షర్మిలను కలసి తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీ పెట్టవలసిందిగా కోరినట్టు తెలిసింది’’

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.