అమెరికాలో ట్రంప్ హయాంలో లోకల్ సెంటిమెంట్ బలంగా ఉన్న సంగతి తెలిసిందే. అమెరికాలోని ఉద్యోగాల్లో స్థానికులకే పెద్దపీట వేయాలన్న ట్రంప్ నిర్ణయంతో భారత్ సహా పలు దేశాల వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హెచ్1బీ, హెచ్ 4 వీసాల విషయంలో ట్రంప్ నిరంకుశ వైఖరితో అమెరికాయేతరులు బెంబేలెత్తిపోయారు. మరోసారి ట్రంప్ అధికారంలోకి వస్తే చాలామంది హెచ్1బీ, హెచ్4 వీసాదారులు తట్టాబుట్టా సర్దుకొని తమ తమ దేశాలకు వెళ్లాల్సివస్తుందేమోనని భయపడ్డారు.
అయితే, ట్రంప్ పాలన ముగియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ నేపథ్యంలో హెచ్1బీ, హెచ్4 వీసాదారులకు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైెడెన్ శుభవార్త చెప్పారు. తాను చెప్పినట్టుగానే అమెరికాకు విదేశీ నిపుణుల వలసల విషయంలో సానుకూల దృక్పథంతో బైడెన్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే హెచ్4 వీసాలను నిలిపివేయాలన్న ట్రంప్ సర్కారు నిర్ణయంపై బైడెన్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఇకపై హెచ్1బీ వీసాదారుల జీవితభాగస్వాములకు కూడా అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వర్క్ పర్మిట్లు జారీ చేయాలని బైడెన్ సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రకారం బైడెన్ ప్రభుత్వం బిల్లు కూడా విడుదల చేసింది.
అమెరికాలో గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న హెచ్1బీ వీసాదారులు, ఆరేళ్ల పరిమితిపై పొడిగింపు పొందినవారి భాగస్వాములు (హెచ్4 వీసాదారులు) ఇకపై అమెరికాలో ఉద్యోగ అనుమతి పత్రం కోసం దరఖాస్తు చేసుకునేందుకు తాజా బిల్లు వెసులుబాటు కల్పించనుంది. వారు ఉద్యోగం, స్వయం ఉపాధి పొందేందుకు కూడా ఈ బిల్లు వీలు కల్పించింది. వారికి సామాజిక భద్రత సంఖ్య, బ్యాంకు ఖాతాలు, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఈ బిల్లు అవకాశం కల్పించింది. దీంతో, వారంతా బైడెన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.