బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ పై ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతోన్న తొలి భారత సంతతి వ్యక్తి అయిన రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. 2030 రోడ్ మ్యాప్ అమలు, ప్రపంచ సమస్యలపై కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, భారత్, బ్రిటన్ మధ్య చారిత్రక సంబంధాలు ఇకపై ఆధునిక తరం భాగస్వామ్యంలోకి అడుగుపెడుతున్నాయని మోదీ అన్నారు.
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నిక కావడం అద్భుతమని బైడెన్ అభివర్ణించారు. బ్రిటన్ ప్రిన్స్ ను కలిసేందుకు రిషి వెళ్లే రోజు అద్భుతంగా ఉంటుందని, అదొక ఆదర్శనీయమైన మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. వలస భారతీయులు సాధిస్తున్న విజయాలను బైడెన్ కొనియాడారు. దీపావళి సందర్భంగా వైట్ హౌస్ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక, బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టడం తన జీవితంలో లభించిన అతి గొప్ప గౌరవం అని రిషి సునాక్ అన్నారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు తనపై నమ్మకం ఉంచడాన్ని తనకు లభించిన గౌరవంగా భావిస్తానని రిషి సునాక్ చెప్పారు. తనకెంతో ఇచ్చిన ఆ దేశానికి తిరిగిచ్చే భాగ్యం తనకు దక్కిందని రిషి తెలిపారు. పార్టీకి కూడా శక్తివంచన లేకుండా సేవలు అందిస్తానని పేర్కొన్నారు. గ్రేట్ బ్రిటన్ వంటి గొప్ప దేశం ఇప్పుడు అత్యంత క్లిష్టమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని, స్థిరత్వం, ఐకమత్యంతో దానిని బ్రిటన్ ప్రజలందరం కలిసి ఎదుర్కొందామని రిషి సునాక్ పిలుపునిచ్చారు.
మరోవైపు, తన అల్లుడు బ్రిటన్ ప్రధాని కావడంపై ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సంతోషాన్ని వ్యక్తం చేశారు. రిషికి శుభాకాంక్షలు తెలిపిన నారాయణ మూర్తి…అతడి ఎదుగుదల తనకెంతో గర్వంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని ఆంకాంక్షించారు. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటూ, మంచి పాలనను అందిస్తారని విశ్వసిస్తున్నానని చెప్పారు.