చంద్రబాబునాయుడు అరెస్టు నేపధ్యంలో తెలుగుదేశం పార్టీలో పరిస్ధితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు భార్య భువనేశ్వరి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే రాజమండ్రిలో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి సమావేశమయ్యారు. తాజా పరిస్ధితులపై సమీక్షించారు. గతంలో ఎప్పుడు కూడా పార్టీ నేతలతో భువనేశ్వరి సమావేశమైంది లేదు. మహాయితే కుప్పం నుండి వచ్చిన నేతలతో మాత్రమే సమావేశమయ్యేవారు.
అలాంటిది తాజా సమావేశంలో వివిధ జిల్లాల నేతలు హాజరయ్యారు. జైలు నుండి చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారు ? అప్పటివరకు పార్టీని నడిపించాల్సిన బాధ్యతలు, జనాలకు వాస్తవాలను విడమరచి చెప్పాల్సిన అవసరం తదితరాలపై భువనేశ్వరి మాట్లాడారు. సో, తాజా పరిణామాలను గమనిస్తుంటే తొందరలోనే భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వెళతారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కోడలు బ్రాహ్మణితో కలిసి భువనేశ్వరి జిల్లాలు పర్యటించే అవకాశాలున్నట్లు పార్టీవర్గాల సమాచారం.
జైలు నుండి చంద్రబాబును బయటకు తీసుకురావటంతో పాటు పార్టీని కూడా కాపాడుకోవటంపైన భువనేశ్వరి దృష్టిపెట్టినట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. వివిధ జిల్లాల నుండి నేతలందరినీ రాజమండ్రికి రావాల్సిందిగా భువనేశ్వరి కబురుచేసినట్లు తెలిసింది. జిల్లాల అధ్యక్షులతో చంద్రబాబుకు మద్దతుగా పార్టీ సమావేశం పెట్టి ఒక తీర్మానం చేయించే ప్లానులో ఉన్నారు. నేతలతో సమావేశమైన భువనేశ్వరి వివిధ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారట. చంద్రబాబు ఎన్నిరోజులు రిమాండులో ఉంటారో ఎవరు చెప్పలేకపోతున్నారు. దీని కారణంగా పార్టీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భువనేశ్వరి చర్యలు తీసుకుంటున్నారు.
రిమాండు వ్యవహారాలు చూసుకుని అవసరమైతే కోడలుతో కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళటానికి భువనేశ్వరి మానసికంగా సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టయినపుడు తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లెలు షర్మిల కూడా ఇలాగే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అప్పట్లో జగన్ కు మద్దతుగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు పై ముగ్గురు చాలా కష్టపడ్డారు. అదే పద్దతిలో ఇపుడు భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా జనాల్లోకి వెళ్ళాలనే ఆలోచనైతే చేస్తున్నారు. బహుశా 19వ తేదీ తర్వాత రిమాండ్ విషయమై హైకోర్టు ఏమిచెబుతుందో చూసుకుని డిసైడ్ చేస్తారేమో.