టాలీవుడ్ సీనియర్ హీరో, మాస్ కా బాప్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె షో నాలుగో సీజన్ అట్టహాసంగా ఈ రోజు మొదలైంది. తొలి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబు గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా తన బావ చంద్రబాబును బావ మరిది హోదాలో బాలయ్య సరదా ప్రశ్నలు అడిగి సందడి చేశారు. ఆ తర్వాత రాజకీయాల గురించి, చంద్రబాబు జైలులో 53 రోజులు గడిపిన విషయం గురించి అడిగిన బాలయ్య షోను సీరియస్ మోడ్ లోకి తీసుకువెళ్లారు.
నంద్యాలలో అరెస్ట్ గురించి బాలయ్య అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో ఆడియన్స్ లో చాలామంది భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. నంద్యాలలో మీటింగ్ పూర్తి చేసుకొని బస్సులో విశ్రాంతి తీసుకుంటుండగా..రాత్రంతా పోలీసులు డిస్టర్బ్ చేశారని చంద్రబాబు చెప్పారు. నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడానికి వచ్చారని, సంబంధిత విచారణ అధికారి లేకుండా, కేసు ఏంటో చెప్పకుండా ఎందుకు అరెస్టు చేస్తున్నారని తాను ప్రశ్నించానని అన్నారు.
ఆ రాత్రంతా విజయవాడ నుంచి కోర్టుకు అక్కడి నుంచి రాజమండ్రి జైలుకు తీసుకెళ్లారని అన్నారు. చేయని తప్పునకు జైలుకు వెళ్లడం బాధగా అనిపించిందని, మొదటి రోజు జైల్లో ఎన్నో ఆలోచనలు మనసులో మెదిలాయని చెప్పారు. జైలులో తనను మానసికంగా ఇబ్బంది పెట్టి బలహీనపరచాలని చూశారని, అనుమానాస్పదంగా కొన్ని ఘటనలు జరిగాయని అన్నారు. అయినా సరే తాను ధైర్యంగా ఉన్నానని, లేకపోతే ఏమయ్యేదో…పరిస్థితి ఇంకోలా ఉండేదేమో అని చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.
చనిపోతే ఒక్క క్షణం… అనుకున్న ఆశయం కోసం పని చేస్తే అది శాశ్వతం అనుకుంటూ జైల్లో గడిపానని చెప్పారు. ఆ ఆలోచనే తనను ముందుకు నడిపించిందని, చావు గురించి ఆలోచిస్తే జీవితంలో ఏదీ చేయలేమని అన్నారు. జైలు బయట భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలయ్య, లోకేష్ , ఇతర కుటుంబ సభ్యులు తన వెన్నంటి ఉన్నారని, కోట్లాది ప్రజలు తన కోసం ప్రార్థించారని చెప్పారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ముఖ్యమంత్రి భార్యగా ఉన్నప్పటికీ భువనేశ్వరి ఎప్పుడూ రాజకీయాల కోసం గడప దాటలేదని, తొలిసారి తనతోపాటు బ్రాహ్మణి కూడా రోడ్డుమీదకు వచ్చారని భావోద్వేగానికి లోనయ్యారు.