బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖిల ప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ తరపు న్యాయవాదులు కోరగా….న్యాయమూర్తి నిరాకరించారు. అఖిలప్రియకు బేగంపేట్ పాటిగడ్డ హెల్త్ కేర్ సెంటర్లో కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు నెగెటివ్‌గా తేలింది. దీంతో, గాంధీ ఆసుపత్రికి తరలించి ఈసీజీ, చెస్ట్ ఎక్స్‌రే, గైనకాలజి డిపార్ట్మెంట్లో పరీక్షలు నిర్వహించారు. న్యూరాలజీ వైద్యులు పరీక్షలు జరిపారు. అనారోగ్య కారణాలతో అయినా బెయిల్ వస్తుందని ఆశించిన అఖిల ప్రియకు మరోసారి చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో భూమా అఖిల ప్రియకు రావలసినంత సానుభూతి రాలేదని, సొంత జిల్లా కర్నూలు నుంచి కూడా అఖిల ప్రియకు మద్దతు లేదన్న వాదన తెరపైకి వచ్చింది.
వాస్తవానికి తన తల్లిదండ్రులపై ఉన్న సానుభూతితో అఖిల ప్రియ….శాసనసభ్యురాలైన తక్కువ కాలంలోనే మంత్రి అయ్యారు. యువ ఎమ్మెల్యేగా దూకుడుగా వ్యవహరించిన అఖిల ప్రియ….మంత్రి పదవి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా వ్యవహరించారన్న ప్రచారం జరిగింది. ఈ దూకుడుతో ఆమె తన సొంత వారిని, తన సన్నిహితులను కూడా లెక్కచేయలేదన్న వాదన వినిపిస్తోంది. మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆమె కర్నూలు రాజకీయలలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారని కర్నూలు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఆ దూకుడే ఆమె కొంపముంచిందని, ఇపుడు ఎవరూ అండగా నిలబడే పరిస్థితి లేదని అంటున్నారు. ఏ రంగంలో అయినా తనకంటూ ఓ వర్గం, అనుచరగణం ఉంటేనే రాణించగలరు. భూమా కుటుంబానికి కూడా చాలా ఏళ్లుగా ఓ అనుచరగణం, సన్నిహిత వర్గం ఉంది. అందుకే భూమా ఫ్యామిలీ రాణించగలిగింది. కానీ, అఖిల ఆ బలాన్ని గుర్తించకపోవడంతా వారంతా భూమా కుటుంబానికి దూరమయ్యారు. తల్లిదండ్రులకు ఆప్తులైన వారితో ఆమె వైరం పెట్టుకుని చివరకు జైలుపాలు కావాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.