భగవద్గీతా? బైబిలా? ఏపీ ప్రజలే తేల్చుకోవాలి: బండి సంజయ్

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలు, రథాలపై దాడులు పెరిగాయన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఘటనలకు పాల్పడ్డవారిపై జగన్ ఉదాసీనంగా ఉండడం వలనే మరిన్ని దాడులు జరుగుతున్నాయని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోన ఇపుడు సీఎం జగన్ పై తెలంగాణ బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై వరుస దాడులకు జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సంజయ్ హెచ్చరించారు. 7 కొండలను 2 కొండలు చేయాలనుకున్న పార్టీ ఇప్పుడు ఏపీలో రాజ్యాధికారాన్ని చెలాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కొండలవాడా గోవిందా గోవిందా అనే వైసీపీకి ఓటు వేస్తారా? లేక ఏడు కొండలవాడా గోవిందా గోవిందా అనే బీజేపీకి ఓటువేస్తారా? అని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికనుద్దేశించి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలని సంజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు.

తెలంగాణలో ఒక మతానికి ఇక్కడి సీఎం కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని, ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. ఏపీ దేవాదాయశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. హిందూ దేవాలయాల ఆదాయాన్ని జగన్ సర్కార్ ఇతర మతాలకు దారి మళ్లిస్తోందని ఆరోపించారు.  ఏపీ బీజేపీ నేతలు, కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని, హైదరాబాద్ లో అధికార పార్టీకి బుద్ధి చెప్పినట్లే ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా జగన్ స్పందించకపోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. సింహాచలం పాలక మండలి మార్పు నుంచి, అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టడం, రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సును ఖండించడం వరకు జగన్ హయాంలో ఎన్నో దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయని మండిపడ్డారు. సోము వీర్రాజు దమ్మున్న నాయకుడని, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పారు. తిరుమలకు వస్తున్న ఆదాయమంతా ఎక్కడకు పోతోందని నిలదీశారు. తిరుపతి ఉప ఎన్నికలో ధర్మం గెలవబోతోందా? లేక హిందూ మత వ్యతిరేకులు గెలుస్తారా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.