రైతు వెన్ను విరిగింది!

ఈ ఏడాది మూడు సార్లు వరదలు
భారీవర్షాలు, నివర్‌ తుఫాను కూడా..
ఇంతవరకు పైసా సాయం లేదు
విడతల వారీగా 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం
మాది రైతు మనసు తెలిసిన ప్రభుత్వమని అన్నారు.. గత ప్రభుత్వం ఇచ్చిన రుణ మాఫీ చెక్కులను రద్దుచేశారు! ఖరీఫ్‌, రబీ ఆరంభంలోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామన్నారు.. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా సాయం ఇస్తామన్నారు. ఇప్పుడు మాటతప్పి.. ఆ ఆరు వేలతో కలిపి ఇస్తున్నారు. గత జూన్‌ నుంచి ఇప్పటివరకు 12 అల్పపీడనాలు వచ్చాయి. మూడు నెలలు ఒకటే వానలు. జగన్‌ అధికారంలోకి రావడం వల్లే వానలు తెగకురుస్తున్నాయని.. ఆయన దైవదూత అని భజనపరులు కీర్తించారు. మరి.. పండిన పంటలు వరదలకు నాశనమవడం కూడా దైవదూత కార్యమేనా? ఇప్పటికీ ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో ఎటు చూసినా నీళ్లూ, కన్నీళ్లే! మడులను, మెరకలను ఏకంచేసిన నివర్‌ తుఫాను... అన్నదాతలకు మిగిల్చిన కష్టం అంతాఇంతా కాదు. పొంగి పొర్లిన నదులు, వాగులు అన్నదాతలకు కంటిమీది కునుకు లేకుండా చేశాయి. ఖరీఫ్‌లో వేసిన పంటలను సెప్టెంబరు, అక్టోబరుల్లో విజృంభించిన వరదలు, వర్షాలు భారీగా దెబ్బతీశాయి. ఇప్పుడు... నివర్‌ తుఫానుతో అన్నదాతకు మరో దెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు ఒక అంచనా! మరీ ముఖ్యంగా... కోతకు వచ్చిన వరి నేలరాలింది. ఇప్పటికే కోతలు కోసి, కుప్పలు వేసి,ఓదెలు పేర్చినచోట.. పట్టలు కప్పి పంటలను రైతులు కాపాడుకోగలిగారు. ఆ కష్టఫలాన్ని ఇంటికి చేర్చుకోవడానికి తాపత్రాయపడుతున్న దృశ్యాలు రాష్ట్రాన్ని కదిలించివేశాయి. తుఫాను వచ్చి వారాలు దాటినా ఇంతవరకు పంట నష్టం అంచనాలే వేయలేదు. అదేమని నిలదీస్తే డిసెంబరు 15నాటికి అంచనాలు పూర్తవుతాయని.. 31కల్లా రైతుల ఖాతాల్లో పరిహారం పడిపోతుందని సీఎం జగన్‌ అసెంబ్లీలో చెప్పారు. ఎన్నికలకు ముందు పంటలబీమా ప్రీమియం రైతుల తరఫున తానే కడతానన్నారు. కానీ ఏడాదిగా చెల్లించకపోవడంతో గత ఖరీఫ్‌ నష్టం తాలూకు సాయం రైతుకు అందకుండా పోయింది. ప్రీమియం చెల్లించేశామని ఏడాదిగా ప్రభుత్వం అబద్ధమాడుతోందని టీడీపీ మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ససాక్ష్యంగా నిరూపించడంతో.. ఆగమేఘాలపైన 590 కోట్లు విడుదల చేస్తున్నట్లు జీవో ఇచ్చారు. నిజానికి ఇప్పటికీ అవి ఆయా బీమా కంపెనీలకు అందలేదు. ఇప్పుడు అంచనాలు పూర్తయ్యాక ఇచ్చే సాయం మాట కూడా ఇంతేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అన్ని పంటలకూ...
తూర్పు గోదావరి జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు వేలాది ఎకరాల్లో వరి చేలు ఈదురుగాలికి నేలవాలాయి. కోసిన వరి పనలు నీటిలో నానుతున్నాయి. కోతలయిన వరికుప్పల్లోకి నీరు చేరి, తడిసిపోయాయి. కుప్పనూర్చాల్సిన, చేనులో కోయాల్సిన వరిధాన్యం నాలుగురోజులపాటు ఎడతెరపి లేని వర్షాలతో తడిసి రంగుమారే ప్రమాదం కనిపిస్తోంది. మినుము, పెసర కోయకపోయినా... కాయ పగిలి, గింజ మొలకెత్తుతోంది. మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జ వంటి పంటలు కూడా పూర్తిగా ఇంటికి చేరకుండానే తడిసిపోయాయి. పశ్చిమకృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పత్తి తీయడానికి వీల్లేకుండా తడిసి ముద్దలుగా మారింది. యేపుగా పెరిగిన చెరుకు గడలు, కంది మొక్కలు తలలు వాల్చి, పూత,కాయ రాలిపోతోంది. ఇక ఉద్యాన పంటలైతే.. గాలులకు అరటి, బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. బత్తాయి, సపోట, చీనీ చెట్లు విరిగిపడ్డాయి. పల్లపు ప్రాంతాల్లో పసుపు, టమాటా, ఉల్లి, కంద తోటలు నీటనానుతున్నాయి. దొండ, కాకర పందిళ్లు కూలిపోయాయి. కూరగాయ పంటలకూ కన్పించని నష్టం జరిగింది. తుఫానుతో ముసురు పట్టి, వాతావరణం చల్లబడి పోయి, ఆక్సిజన అందక సాగు చెరువుల్లోని చేపలు, రొయ్యలు దెబ్బతిన్నాయి. చలికి చనిపోతున్నాయి. ఈ మత్స్య సంపదకు తెగుళ్లూ సోకే పరిస్థితి వచ్చింది. ఇక వాన, చలి, గాలికి గొర్రెలు, మేకలు వందల సంఖ్యలో మరణించాయి.
ఇంటికి చేరని కుటుంబ కష్టం..
ఈ ఏడాది ఖరీఫ్‌లో 37 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ప్రస్తుత రబీలో ఐదు లక్షల హెక్టార్లలో ప్రధాన పంటలు సాగులో ఉన్నాయి. జూలై నుంచి అక్టోబరు వరకు మూడు విడతల విపత్తులతో కలిపి ఖరీఫ్‌ పంటల్లో సుమారు మూడు లక్షల హెక్టార్లలోనే పంటలు దెబ్బతిన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు వేసింది. దాని విలువ రూ.మూడు వేల కోట్లని ప్రకటించింది. ఇటీవల కేంద్ర బృందానికీ అదే విషయం నివేదిక రూపంలో తెలిపింది. అయితే ఎన్డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాల ప్రకారం 33ు కంటే అధికంగా దెబ్బతిన్న పంటలనే నష్టంగా పరిగణిస్తున్నారు. ఈ కారణంగా వాస్తవంగా అధిక వర్షాలకు పంట తడిసి, తేమతో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులు భారీగా ఉన్నాయని రైతు నేతలు చెప్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాల పరిధిలోకి రాని పంట ఉత్పతులను కొనుగోలు చేసేందుకు సగటు నాణ్యత ప్రమాణాలు(ఎఫ్‌ఏక్యూ) నిబంధనలు సడలించాలని కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వం కోరింది. దీనిపై ఇంకా కేంద్రం నుంచి స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా అక్టోబరులో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రైతులు ఇంకా పూర్తిగా అమ్మకానికి పెట్టలేదు. మొదటి పంటలో వరి ధాన్యం 86.39లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా, అందులో ఇప్పటి వరకు 20ు కూడా సేకరణ జరగలేదు. పత్తి 11.51లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా ఉండగా, అందులో పావు వంతు అధిక వర్షాలకు ఉత్పత్తి పడిపోయింది. వేరుశనగ 7.73లక్షల టన్నులు వస్తుందని అంచనా ఉన్నా, వర్షాలతో 30ుపైగా దెబ్బతింది. డిసెంబరులో కోతకొచ్చే కంది, ఉలవ తప్ప, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరులో కోయాల్సిన పంటల్లో సగానికి సగం వర్షార్పణమైపోయింది.
వరుస ఉపద్రవాలు
రాష్ట్ర రైతాంగాన్ని ఈ ఏడాది వరుస విపత్తులు వెంటాడుతున్నాయి. నివర్‌ తుఫాన దెబ్బనుంచి కోలుకోక ముందే, రైతులకు మరో రెండు ఉపద్రవాలు పొంచి ఉన్నాయి. అనతికాలంలోనే రెండు తుఫాన్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. శనివారం హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండురోజుల్లోనే వాయుగుండంగా ఆ తర్వాత నాలుగు రోజుల్లో తుఫానగా మారే అవకాశం ఉంది. ఇది డిసెంబరు రెండోతేదీన తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఆ తర్వాత మరో తుఫాను కూడా వచ్చే అవకాశమూ ఉందని హెచ్చరించింది. గతేడాది అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులు.. ఈ ఏడాది వరుస ఉపద్రవాలతో భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. విపత్తులతో పంటలన్నీ దెబ్బతిని, పెట్టుబడులు కూడా రైతులు నష్టపోయారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన నెల మినహా, జూలై నుంచి అల్పపీడనాలు, వాయుగుండాలతో రైతులను వరుస విపత్తులు ముప్పెరగొన్నాయి. ఆరేడు నెలల్లోనే 12అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అక్టోబరులో వాయుగుండం కాకినాడ వద్ద తీరం దాటగా, మూడు రోజుల క్రితం నివర్‌ తుఫాన తమిళనాడులో తీరం దాటి ఏపీపై తీవ్ర ప్రభావం చూపింది. ఈఏడాది విపత్తులతో దాదాపు 20లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనాలున్నాయి. రబీ సీజనలో ఇప్పటికే ఐదులక్షల హెక్టార్లలో పంటలు సాగులో ఉన్నాయి. నివర్‌ తుఫానతో సీమ, దక్షిణకోస్తాలో రబీ పైర్లు నీట మునిగాయి. ముంపు నుంచి తేరుకుంటేనేగానీ ఆ పంటలు ఏమాత్రం బాగుంటాయో తెలియదు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.