బెంగళూరులో పోలీసులు రేవ్ పార్టీ ని భగ్నం చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు, బుల్లితెర నటులు, మోడల్స్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ సంచలన విషయాలను మీడియాకు వెల్లడించారు. ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అని ఆయన చెప్పారు.
ఈ పార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. అయితే, తాను ఈ పార్టీలో పాల్గొనలేదని, సొంత ఫాంహౌస్ లోనే ఉన్నానంటూ హేమ విడుదల చేసిన వీడియో ఎక్కడ రికార్డ్ చేశారన్నదానిపై విచారణ జరుపుతున్నామని సీపీ వివరించారు.
తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, చిల్ అవుతున్నానని హేమ వీడియో పెట్టడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, బెంగుళూరు పోలీస్ కమిషనర్ చెప్పిన తర్వాత కూడా తాను హైదరాబాద్ లోని ఇంట్లో బిర్యానీ వండుతున్నట్లుగా హేమ మరో వీడియో పెట్టడంతో ఆమెపై ట్రోలింగ్ జరుగుతోంది. దొరికిపోయి బుకాయించడం ఎందుకని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.