జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అమెరికాలో గౌతమ్ అదానీపై లంచం అభియోగాలు నమోదైన నేపథ్యంలో సెకీతో ఏపీ సౌరవిద్యుత్ ఒప్పందంపై ఆరోపణలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ విద్యుత్ శాఖ మాజీ మంత్రి బాలినేని ఈ అంశంపై ఇటీవల స్పందిస్తూ.. సెకీతో సౌరవిద్యుత్ ఒప్పందంలో తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. సెకీతో ఒప్పంద పత్రాలపై సంతకం చేయమని అర్ధరాత్రి ఒత్తడి చేశారని.. తాను అంగీకరించకపోవడంతో కేబినెట్ లో పెట్టి ఆమోదించుకున్నారంటూ బాలినేని సంచలన విషయాలు వెల్లడించారు.
అయితే బాలినేని వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మెప్పు పొందడానికే బాలినేని ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. దీంతో ఈ రోజు మరోసారి ప్రెస్ మీట్ పెట్టిన బాలినేని.. సీఎం జగన్, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లక్ష్యంగా స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరి మెప్పు కోసమో తాను పనిచేయడం లేదని.. వైఎస్‌పై అభిమానంతోనే మంత్రి పదవి వదులుకొని జగన్ పార్టీలోకి వెళ్లానని బాలినేని అన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణించాక మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవిని వదులుకున్నానని గుర్తుచేశారు.
పదవుల కోసం వెంపర్లాడే వ్యక్తితత్వం తనది కాదని.. తాను విలువలతో రాజకీయాలు చేసే వ్యక్తినని బాలినేని పేర్కొన్నారు. తిట్టేవాళ్లకే టికెట్లు ఇస్తామనే సంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో తెలుసని చెవిరెడ్డిపై బాలినేని సెటైర్లు వేశారు. మాగుంట శ్రీనివాసులును కాదని చెవిరెడ్డికి ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారు..? ఒంగోలులో పోటీ చేసే నాయకుడే లేరని చిత్తూరు జిల్లా నుంచి తెచ్చారా? అని బాలినేని నిలదీశారు. అలాగే వైసీపీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో మొత్తం చెబుతానని.. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలంటూ చెవిరెడ్డికి బాలినేని సవాల్ విసిరారు.
జగన్ ఒక్కడే రాజశేఖర్ రెడ్డి కుటుంబమా..? షర్మిల, విజయమ్మ కాదా? షర్మిల, విజయమ్మపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టించింది ఎవరో అందరికీ తెలుసని బాలినేని అన్నారు. తాను ఎవరిపై విమర్శలు చేయనని.. తన జోలికి వస్తే నిజాలన్ని చెప్పాల్సి వస్తుందన్నారు. తాను నోరు విప్పితే మీరు తలెత్తుకోలేరంటూ బాలినేని హెచ్చరించారు. ఇక సెకీతో సౌరవిద్యుత్ ఒప్పందం అంశంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని మరోసారి బాలినేని వెల్లడించారు. కనీసం ఒప్పందానికి సంబంధించి సీఎండీ దస్త్రం కూడా తన వద్దకు రాలేదన్నారు.