వైసీపీ లో రోజుకో సంచలనం తెరమీదకి వస్తోంది. నాయకులు మౌనంగా పార్టీకి రాజీనామాలు చేయడం.. కొందరు ఇల్లీగల్ వివాదాలతో రోడ్డెక్కడం.. మరికొందరు.. భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ తలనొప్పులు ఒకవైపు పార్టీని కుంగదీస్తుంటే.. మరోవైపు, స్థానిక సంస్థల్లో వైసీపీ కార్పొరేటర్లు, మేయర్లు కూడా.. జెండా మార్చేస్తున్నారు. పార్టీకి గుడ్‌బై కూడా చెప్పేస్తున్నారు. దీంతో పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే వచ్చింది.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగర పాలక సంస్థలో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. ఇక్కడ 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరావు వర్గం విజయం దక్కించుకుంది. దీంతో వైసీపీనే ఇక్కడ పాలన సాగిస్తోంది. ఇటీవల కాలంలో వైసీపీతో బాలినేని విభేదిస్తున్న క్రమంలో ఆయన వర్గంగా ఉన్న కార్పొరేటర్లు, మేయర్ కూడా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాయి. మరోవైపు.. టీడీపీ కూడా ఇదే అవకాశం అన్నట్టుగా వారిని పార్టీలో చేర్చేసుకుంది.
తాజాగా 12 మంది కార్పొరేటర్లు సహా మేయర్ సుజాత పార్టీ మారి టీడీపీ సైకిల్ ఎక్కారు. వీరిని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి కండువా కప్పారు. అయితే.. వీరు ఇలా రావడం వెనుక పలు అనుమానాలు తెరమీదికి వచ్చాయి. మాజీ మంత్రి బాలినేని కొన్నాళ్లుగా వైసీపీతో విభేదిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వర్గంగా ఉన్న కార్పొరేటర్లు పార్టీ మారిపోవడం అంటే.. ఆయన తెరవెనుక లేకుండా వీరు బయటకు వస్తారా? అనేది అనుమానం.
అంతేకాదు.. పార్టీని బలహీన పరచడం ద్వారా.. నియోజకవర్గంలో తన విలువ ఏంటో పార్టీ అధిష్టానానికి తెలియజేయాలని బాలినేని భావిస్తున్నారా? అనేది కూడా అనుమానంగానే ఉంది. ఏదేమైనా.. కీలకమైన ఒంగోలులో వైసీపీ ఇప్పుడు బలాన్ని పోగొట్టుకోవడమే కాకుండా.. స్థానికంగా జెండా మోసే పరిస్థితి కూడా లేకుండా పోతుండడం గమనార్హం. గతంలో ఇక్కడ బాలినేని వర్సెస్ వైవీ సుబ్బారెడ్డివివాదం ఉండగా.. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి వర్సెస్ బాలినేనిల మధ్య వివాదం రగులుతోంది.