వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీపైనా.. పార్టీ అధినేత జగన్‌పై కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ కూడా మారుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఇంతలోనే బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారంటూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం.. మరింతగా రాజకీయ దుమారానికి దారి తీసింది. ఆయన నిజంగానే ఈ వ్యాఖ్యలు చేశారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం మాత్రం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతుండడం గమనార్హం.
“పిల్ల కాంగ్రెస్(వైసీపీ) పార్టీ ఏదో ఒకరోజు తల్లి కాంగ్రెస్(జాతీయ పార్టీ కాంగ్రెస్)లో కలిసిపోవడం ఖాయం. ఇప్పటికే జరిగిపోయి ఉండాలి. అయితే..షర్మిల అడ్డుపడింది. ఆమె అడ్డు పడకపోయి ఉంటే.. ఏనాడో పిల్ల కాంగ్రెస్ పార్టీ..తల్లి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయి ఉండేది. కానీ, ఇది జరగడం మాత్రం ఖాయం. ఎందరు అడ్డుపడినా.. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు ఏకమవుతాయి. మహా అయితే.. మరో ఏడాది!“ అని బాలినేని వ్యాఖ్యానించినట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ పార్టీకానీ, ఇటు వైసీపీ నుంచి ఎలాంటి రాయక్షన్ లేకపోవడం గమనార్హం.
ఈ విమర్శలు కొత్త కాదు!
కాగా.. వైసీపీ విషయంలో జరుగుతున్న ఇలాంటి ప్రచారాలు.. విమర్శలు కొత్తకాకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఎన్నికలు ముగిసిన తర్వాత.. వైసీపీ అధినేత జగన్ బెంగళూరు పర్యటనకు వెళ్లి పది రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కె. శివకుమార్‌తో జగన్ భేటీ అయ్యారని.. అక్కడ వైసీపీ విలీనంపై చర్చించారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు.. ఈ విషయంపై రాహుల్ గాంధీ వరకు కూడా చర్చలు వెళ్లాయని కూడా కొందరు చెప్పుకొచ్చారు. ఆ తర్వాతకూడా.. ఇలాంటి ప్రచారం కామన్ అయింది. అయితే.. వైసీపీకి వీర విధేయుడు అయిన బాలినేని ఇప్పుడు చేశారని ప్రచారం జరుగుతున్న వ్యాఖ్యలు ఏమేరకు నిజమవుతాయో చూడాలి.