వినాయచవితి వస్తుందంటే ఒకలాంటి ఉత్సాహం రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా హైదరాబాద్ మహానగరంలో వినాయకచవితి హడావుడే వేరుగా ఉంటుంది. ప్రతి గల్లీలోనూ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఒక ఎత్తు అయితే.. తొమ్మిది రోజుల పాటు పూజలు జరిపి.. శోభాయాత్ర పేరుతో ఒకే రోజు నిమజ్జనాన్ని నిర్వహిస్తుంటారు.
ఈ సందర్భంగా మహానగరం మొత్తం నిమజ్జన హడావుడిలో మునిగిపోతుంది. నగరం మొత్తం ఒకలాంటి ఆథ్యాత్మిక భావంతో ఊగిపోవటం కనిపిస్తుంది. వేలాది విగ్రహాలు ఒకటి తర్వాత ఒకటి చొప్పున నిమజ్జనాలు జరుగుతుంటాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. నిమజ్జనం రోజున స్వామి వారికి ప్రసాదంగా ఉంచిన లడ్డూను వేలం వేస్తారు.
ఎవరైతే ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తారో.. వారికి దాన్ని సొంతం చేస్తారు. లడ్డూ వేలంలో స్వామి వారి ప్రసాదాన్ని సొంతం చేసుకుంటే.. ఆ ఏడాది వారికి తిరుగు ఉండదని.. వారి ఇంట సిరులు పొంగుతాయని.. కలిసి వస్తుందన్న నమ్మకం చాలా ఎక్కువ. దీంతో.. కొన్నిచోట్ల ఏర్పాటు చేసే మండపాల్లోని లడ్డూ వేలంపై రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొని ఉంటుంది.
అలాంటి కోవలోకి వస్తుంది బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం. 1994లో మొదలైన ఈ లడ్డూ వేలం.. ఏడాదికి ఏడాదికి క్రేజ్ పెరిగిపోయింది. 1994లో రూ.450లతో లడ్డూ ప్రసాదాన్ని వేలంలో సొంతం చేసుకుంటే.. 1999 నాటికి రూ.65వేలకు చేరుుంది. 2000 నాటికి రూ.66వేలు పలికిన లడ్డూ ప్రసాదం.. ఆ తర్వాత ఏడాదికి ఏడాది అంతకంతకూ పెరిగిపోతూ వచ్చింది. 2005 నాటికి రూ.2.08లక్షలకు లడ్డూ ప్రసాదం వేలంపాట చోటు చేసుకుంది. మరో ఐదేళ్లు గడిచేసరికి అంటే 2010 నాటికి లడ్డూ వేలం ఏకంగా రూ.5.35 లక్షలకు చేరుకొని సరికొత్త రికార్డును టచ్ చేసింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో రికార్డు స్థాయిలో రూ.9.50 లక్షల రికార్డు ధర పలికింది.
2015లో తొలిసారి లడ్డూ వేలం రూ.10లక్షల మార్కును దాటేసి మరో రికార్డు దిశగా అడుగులు వేసింది. ఆ ఏడాది లడ్డూ వేలం రూ.10.32 లక్షలు పలికింది. 2016లో ఒక్కసారి రూ.4లక్షల మొత్తం పెరిగి ఆ ఏడాది రూ.14.65 లక్షలకు వెళ్లింది. 2017లో రూ.15.60లక్షలు.. 2018లో రూ.16.60లక్షలు.. 2019లో రూ.17.60లక్షల వరకు వెళ్లింది.
కరోనా కారణంగా 2020లో వేలాన్ని నిర్వహించకపోవటం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది నిర్వహించిన లడ్డూ వేలంలో ఇప్పటివరకు ఉన్న రికార్డుల్ని చెరిపేసి కొత్త రికార్డును క్రియేట్ చేశారు. రూ.18.90లక్షల భారీ మొత్తానికి బాలాపూర్ గణేశ్ లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈసారి బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నది ఎవరో తెలుసా? ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్.. మర్రి శశాంక్ రెడ్డిలు సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక బాలాపూర్ గణేశ్ లడ్డూను సొంతం చేసుకోవటం సంతోషంగా ఉందన్నారు.
గణేశుడి కృపతో తెలుగు రాష్ట్రాలు బాగుండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లడ్డూను కానుకగా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే బాలాపూర్ వేలంలో పాల్గొన్నట్లుగా వారు చెప్పారు. మరి.. టీఆర్ఎస్ నేతలకు ఇలాంటి ఆలోచన ఎందుకు రానట్లు చెప్మా?