విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టడంపై ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయంపై టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలు, ఆమాటకొస్తే వైసీపీలోకి కొందరు నేతలు, నందమూరి కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తనయురాలు వైఎస్ షర్మిల స్వయంగా ఆ పేరు మార్పును ఖండించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని….ఎన్టీఆర్ అంటే ఒక సంస్కృతి, ఒక నాగరికత, తెలుగుజాతి వెన్నెముక అని బాలయ్య తనదైన శైలిలో చెప్పారు.
తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ (శంషాబాద్ విమానాశ్రయం) పేరు మార్చాడని… కొడుకు గద్దెనెక్కి యూనివర్శిటీ పేరు మారుస్తున్నాడని బాలయ్య ఫైర్ అయ్యారు. వారిని మార్చడానికి ప్రజలు, పంచభూతాలు ఉన్నాయని, తస్మాత్ జాగ్రత్త అని బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీలో మహనీయుడు ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారని, పీతలున్నారని కొడాలి నాని, వల్లభనేని వంశీలనుద్దేశించి బాలయ్య పరోక్షంగా ఎద్దేవా చేశారు.
విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు కూడా వెక్కిరిస్తున్నాయని వారిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అని బాలయ్య మండిపడ్డారు. తెలుగువాడి గుండెల్లో కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ఉన్నట్టుగా కార్టూనిస్ట్ శ్రీధర్ వేసిన కార్టూన్ ను కూడా సోషల్ మీడియాలో బాలయ్య షేర్ చేశారు.