జూనియర్ ఎన్టీఆర్ పై హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గురించి జూ.ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోయినా పట్టించుకోనని తనదైన శైలిలో అన్నారు. రోజా వ్యవహారంపై మాట్లాడకపోవడమే మంచిదని, బురదమీద రాయేస్తే మనమీదే పడుతుందని చెప్పారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, తన సోదరి పురందేశ్వరితో టచ్లో ఉన్నామని, చంద్రబాబు అక్రమ అరెస్టుపై తప్పకుండా కేంద్రాన్ని కలుస్తామని అన్నారు. చంద్రబాబు అరెస్టుపై గత మూడు రోజులుగానే బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారని, ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ జపం మొదలుపెట్టారని పరోక్షంగా చురకలంటించారు. రాజకీయాలు పక్కనబెట్టి తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో సైకో పాలన నడుస్తోందని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టి కక్ష సాధించడమే పనిగా జగన్ పెట్టుకున్నారని విమర్శించారు.
ఇక, చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం హస్తం ఉందో లేదో తెలియదని, అటువంటపుడు అనవసరంగా నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. అయితే, చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం కల్పించుకోవాల్సిన అవసరముందని, ఒకవేళ స్పందించం అంటే దానిని వారి విజ్ఞతకే వదిలేయాలని బాలయ్య చెప్పారు. ఏది ఏమైనా అబ్బాయి తారక్ పై బాబాయ్ బాలయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.