బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిజంగానే తన అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారని చెప్పక తప్పదు. తాను ఏపీకి చెందిన నేతనన్న విషయాన్నే మరిచిన సోము… కృష్ణా నదిపై రెండు తెలుగు రాష్ట్రాలు కడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి ఆయన కేంద్రానికి రాసిన లేఖే ఈ విషయాన్ని బయటపెట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అంటేనే… అంతెత్తున ఎగిరిపడుతున్న సోము వీర్రాజు… ప్రస్తుతం ఏపీకి సీఎంగా జగన్ ఉన్నా కూడా ఇంకా చంద్రబాబుపైనే నిందలేస్తూ సాగుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబుపై తనకున్న కోపాన్ని మరోమారు బయటపెట్టుకున్న సోము… అసలు చంద్రబాబు తనకు వ్యక్తిగతంగానే శత్రువు అన్న రీతిలో పేట్రేగిపోయిన వైనం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.
ప్రాజెక్టుల విషయంలో ఏపీకి ఏమేర అన్యాయం జరిగినా… తనకేమీ పట్టదని, అసలు ఏపీ ప్రజలన్నా, ఏపీ ప్రాజెక్టులన్నా తనకేమీ పట్టవని, కేవలం చంద్రబాబును దోషిగా చూపించడమే తనకు కావాల్సిందన్న రీతిలో సోము శివాలెత్తిపోయారని చెప్పాలి.
కృష్ణా నదిపై అటు తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులను ఏపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా… ఇటు ఏపీ కడుతున్న రాయలసీమ ప్రాజెక్టుపైనా తెలంగాణ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఈ పంచాయతీని దిద్దేందుకు రంగంలోకి దిగిన కేంద్రం… ఇరు రాష్ట్రాల సీఎంలను కూర్చోబెట్టి మాట్లాడేందుకు నిర్ణయించుకుని ఆ పనిని కూడా పూర్తి చేసింది.
ఇలాంటి కీలక సమయంలో ఏపీకి చెందిన ఓ రాజకీయ నేతగా, ఏపీకి చెందిన వ్యక్తిగా ఏపీ వాదనను బలంగా వినిపించే విషయంలో సోము తనదైన శైలి మార్కును చూపించారు. కృష్ణా నదిపై తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులు ఎలాగూ పూర్తి అయ్యే స్థితిలో ఉన్నాయి కనుక వాటిని వ్యతిరేకించడం మానాలని, వాటికి ఏపీ సహకరించడమే మేలని సోము వీర్రాజు కేంద్రానికి రాసిన లేఖలో సూచించారు. అదే సమయంలో ఏపీ కడుతున్న రాయలసీమ ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని కూడా సోము తనదైన పైత్యాన్ని రంగరించేశారు.
మొత్తంగా ఈ విషయంలో ఏపీకి ఏమేర నష్టం జరిగినా కూడా తనకేమీ పట్టనట్టుగానే వ్యవహరించిన సోము… మొత్తంగా ఏపీ నేతగా ఉంటూ తెలంగాణకు సహకరిస్తున్నట్లుగా తనదైన శైలి వైఖరిని బయటపెట్టుకున్నారు.
ఈ లేఖలో సోము మరో పైత్యాన్ని కూడా ప్రదర్శించారు. అప్పుడెప్పుడో ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు ఈ విషయాన్ని ఏమీ పట్టించుకోలేదని, నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ కూడా దీనిపై స్పందించలేదని నిందలేసిన వీర్రాజు… తాను చేసిన సూచనలతో ఏపీకి ఏ మేర నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని మాత్రం విస్మరించేశారు.
అసలు తాను ఏం చేసినా కూడా ఏపీ ప్రజలు తనను ఏమీ అనరన్న తన వైఖరిని కూడా ఆయన బయటపెట్టుకున్నారు. అధికారంలో ఉన్న జగన్ ను వదిలేసి… విపక్ష నేతగా మారిపోయిన చంద్రబాబుపై మరోమారు విమర్శలు గుప్పించిన వీర్రాజు… ఇక ముందు కూడా చంద్రబాబును తాను శత్రువుగానే చూస్తానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.
అంతేకాదండోయ్… ఈ లేఖలో ఆయన చంద్రబాబు పేరును ప్రస్తావించిన తీరును చూస్తుంటే… చంద్రబాబు తనకు ఏదో రాజకీయ వైరివర్గం మాత్రమే కాదని, వ్యక్తిగతంగానూ తనకు చంద్రబాబు శత్రువేనన్న విషయాన్ని కూడా వీర్రాజు బయటపెట్టుకున్నారు. మొత్తంగా చంద్రబాబుపై తనకున్న కోపాన్ని ఏపీ ప్రయోజనాలను దెబ్బ తీసే రీతిలో వ్యక్తపరచిన వీర్రాజుకు నిజంగానే ఏపీ ప్రజలంటేనే భయం లేదన్న తన సిసలైన వైఖరిని బయటపెట్టుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.