590, 588, 584,580,579….550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 130 మంది…500కుపైగా మార్కులు సాధించిన విద్యార్థులు 110 మంది…మ్యాథ్స్ లో నూటికి నూరు సాధించిన విద్యార్థులు 50 మంది…ఇలా పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కాగానే కార్పొరేట్ స్కూళ్లు టీవీ యాడ్లతో ఊదరగొట్టేస్తుంటాయి. సమాజం, పేరెంట్స్ లో మెజారిటీ కూడా మార్కులే ప్రతిభకు కొలమానం అని ఫిక్సయి ఉంటారు. కాబట్టి, ఫలితాలు రాగానే మార్కులతో విద్యార్థులను కొలవడం మొదలుబెడుతుంటారు.
కరెక్టే, మార్కులను బట్టే ఆ విద్యార్థి ప్రతిభను కొలవగలం. కానీ, నూటికి 85-90 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు మాత్రమే ప్రతిభ ఉన్నవారు కాదు. నూటికి 35-40 శాతం మార్కులు తెచ్చుకొని… అత్తెసరు మార్కులతో పాసయ్యారనిపించుకునేవారిలోనూ ప్రతిభ ఉంటుంది. ఈ విషయాన్ని గుజరాత్ కు చెందిన ఐఏఎస్ అధికారి తుషార్ సుమేరా నిరూపించారు. తుషార్ సుమేరాకు పదో తరగతిలో ఇంగ్లిష్ లో కేవలం పాస్ మార్కులు 35 వచ్చాయంటే నమ్మగలరా?
ఇక, మ్యాథ్స్ లో 36, సైన్స్ లో 38 మార్కులు సాధించి అత్తెసరు మార్కులతో పాసైన తుషార్ సుమేరా ఐఏఎస్ అయ్యారంటే ఔరా అనకుండా ఉండగలరా? అందుకే, ఈ విషయం తెలుసుకున్న తోటి ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్…తుషార్ సుమేరా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ను ట్విటర్ లో షేర్ చేశారు. దాంతో పాటు…బరూచ్ కలెక్టర్ కార్యాలయంలో ఆసీనులైన తుషార్ సుమేరా ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. దీంతో, ఆ ఫొటో వైరల్ అయింది.
మంచి మార్కులు సాధించాలనుకోవడంలో తప్పు లేదు. కానీ, ఇన్ని మార్కులు తెచ్చుకోవాల్సిందేనంటూ విద్యార్థులపై ఒత్తిడి పెట్టే తల్లిదండ్రులు, అధ్యాపకులకు కచ్చితంగా తుషార్ సుమేరా ఉదంతం ఓ కనువిప్పువంటింది. ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు నాణ్యమైన విద్య, అభ్యాసం అవసరం. కానీ, ఆ లక్ష్య సాధనకు మార్కులే కొలమానం కాదని ఈ ఉదంతం తెలియజేస్తోంది. దీంతో, ఈ వైరల్ అయిన ట్వీట్ పై నెటిజన్లు తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.