మహారాష్ట్రలో బోలెడన్ని పార్టీలు ఉన్నా.. శివసేన లెక్క కాస్త భిన్నంగా ఉంటుంది. అలాంటి పార్టీలో ఉండి.. ఉద్దవ్ ఠాక్రే లాంటి అధినేతకు షాకిచ్చి.. ప్రభుత్వాన్ని పడగొట్టటమే కాదు.. పార్టీ సైతం చెల్లాచెదురు అయ్యేలా చేసిన ఘనత ఏక్ నాథ్ షిండే సొంతం. ఆయన వెనుక ఎవరు ఉన్నారన్నది తర్వాతి విషయం.. ఆయన ప్రస్థానం ఎలా స్టార్ట్ అయ్యిందన్న విషయాన్ని చూసినప్పుడు మాత్రం విస్మయానికి గురి కాకుండా ఉండలేం.
ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం అంటే మాటలు కాదు. రాజకీయాలు ఎంత కఠినంగా ఉంటాయి.. మరెంత కటువుగా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పటంలో మహారాష్ట్ర తాజా రాజకీయం ముందుందని చెప్పాలి.
ఇక.. ఏక్ నాథ్ షిండే ప్రస్థానంలోకి వెళితే.. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని జవాలీ తాలూకాలో 1964 ఫిబ్రవరి 9న జన్మించారు ఏక్ నాథ్ షిండే. పొట్ట కూటి కోసం థానేకు వలస వెళ్లింది ఆయన కుటుంబం. అక్కడ ఆటో డ్రైవర్ గా ఆయన తన జీవితాన్ని షురూ చేశారు. ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ చేసిన ఆయన.. 1980లో శివసేన కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని షురూ చేశారు.
1997లో థానే మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా గెలుపొందారు. ఆ తర్వాత 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి పచ్చ పాఖాది నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన అక్కడి నుంచి గెలుపొందటం గమనార్హం. 2005లో థానే జిల్లా శివసేన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2014లో పార్టీ తరఫున ప్రతిపక్ష నేతగా.. శివసేన శాసనసభా పక్ష నేత స్థాయికి ఎదిగారు.
2019లో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాల మంత్రిగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. పార్టీ మీద ఉన్న అసంతృప్తితో తిరుగుబాటు చేయటం.. జూన్ 21న పార్టీ నుంచి సస్పెండ్ కావటం తెలిసిందే.
అనంతరం 40 మంది పార్టీ ఎమ్మెల్యేల్ని కలుపుకున్న ఆయన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే కాదు..ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అదే సమయంలో.. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను.. ఉప ముఖ్యమంత్రిగా చేసుకోవటం చూస్తే.. ఏక్ నాథ్ షిండే మామూలోడు కాదన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.