2024 ఎన్నికల అనంతరం వైసీపీ ఖాళీ అవుతూ వస్తోంది. అధికారం లేని చోట ఉండలేక ఆ పార్టీ నాయకులంతా ఒక్కొక్కరిగా అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి వరుస షాక్ లు ఇస్తున్నారు. అయితే ఈ జాబితాలో జగన్ కు అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా చేరబోతున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలతో ఆదిమూలపు సురేష్ టచ్ లోకి వెళ్లారని.. త్వరలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కేయడం ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే తాజాగా ఈ ప్రచారాన్ని ఆదిమూలపు సురేష్ ఖండించారు. గురువారం సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య సమర యోధులు, జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిని మాజీమంత్రి ఆదిమూలపు సురేష్.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరతానంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని.. ప్రాణం ఉన్నంత వరకు వైసీపీని వీడే ప్రసక్తే లేదని సురేష్ వివరణ ఇచ్చారు.
`జగన్ మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకులు. నా ఇరవై ఏళ్ల రాజకీయ అనుభవంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి తర్వాత అంత గొప్ప నాయకుడ్ని మరొకరిని చూడలేదు. జగన్ మంత్రివర్గంలో ఆయన సహచరునిగా పని చేయడం నా అదృష్టం. దళితుడునైన మమ్మల్ని మొత్తం దళిత జాతి గర్వించదగ్గ విధంగా ప్రోత్సహించి, ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి, అడుగడుగునా మమ్మల్ని వెన్నుతట్టిన ఆ నాయకుడి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేము. నా ఊపిరి ఉన్నంత వరకు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన అడుగుజాడల్లో నడుస్తాను` అంటూ ఆదిమూలపు సురేష్ మీడియాతో వెల్లడించారు. పార్టీ మార్పును ఆయన తీవ్రంగా ఖండించారు.