టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న కాజల్ అగర్వాల్, తమన్నా కోట్ల రూపాయల స్కామ్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పి పుదుచ్చేరికి చెందిన పదిమంది నుంచి సుమారు రూ. 2.40 కోట్లు వసూలు చేశారని అశోక్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో తమన్నా, కాజల్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఇద్దరు హీరోయిన్లను విచారించాలని పోలీసులు నిర్ణయించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2022లో కోయంబత్తూరు ప్రధాన కార్యాలయంగా క్రిప్టో కరెన్సీ పేరుతో ఓ కంపెనీ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నటి తమన్నాతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆ తర్వాత మహాబలిపురంలోని స్టార్ హోటల్ లో సదురు సంస్థ ఓ కార్యక్రమాన్ని నిర్వహించగా.. కాజల్ అగర్వాల్ హాజరైంది. అనంతరం ముంబైలోని క్రూయిజ్ నౌకలో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసిన సంస్థ నిర్వాహకులు.. అత్యధిక రిటర్న్ ఇస్తామని చెప్పి పెట్టుబడులు పెట్టేలా ప్రజల్ని ఆకర్షించారు. వేలాది మంది నుంచి కోట్ల రూపాయిలను సేకరించి మోసం చేశారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే అరవింద్ కుమార్, నితీష్ జైన్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో భాగంగా కాజల్ అగర్వాల్, తమన్నాలను కూడా విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. కాగా, ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తమిళనాడు, కేరళతో సహా పలు ప్రాంతాల్లో క్రిప్టో కరెన్సీ సంస్థ పై కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రూ. 50 నుంచి 60 కోట్ల మేర సదరు సంస్థ మోసాలకు పాల్పడినట్లు పుదుచ్చేరి సైబర్ క్రైమ్ ఎస్పీ భాస్కరన్ వెల్లడించారు.