ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఏపీలోని పలు దేవాలయాల్లోని విగ్రహాల్ని ధ్వంసం చేసిన వైనం ఎంతలా కలకలం రేపిందో తెలిసిందే. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైనం దేశ వ్యాప్తంగా అందరి చూపు ఏపీ మీద పడేలా చేసింది.
తాజాగా హైదరాబాద్ మహానగరంలోనూ ఇదే తరహాలో విగ్రహ ధ్వంసం చేసిన ఉదంతం ఒకటి వెలుగు చేసింది. కూకట్ పల్లి పరిధిలోని మూసాపేటలోని సఫ్దార్ నగర్ లోని కట్టమైసమ్మ టెంపుల్ లో అమ్మవారి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
విగ్రహాన్ని పెకిలించి బయట పడేయటమే కాదు.. ఆలయ ఆవరణలో ఉన్న నాగదేవతల ప్రతిమల్ని పగులగొట్టారు. ఒక కుక్కను చంపి ఆలయం ముందు ఉన్న షెడ్డు రాడ్ కు ఉరి తీసిన వైనం సంచలనంగా మారింది. ఆలయ ఆవరణలో చోటు చేసుకున్న భీతావాహ ద్రశ్యాల్ని చూసిన వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఘటనా స్థలానికి పోలీసులు.. రాజకీయ నేతలు పలువురు హాజరయ్యారు. జరిగిన దారుణంపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేయగా.. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు.. విగ్రహాల్ని పున:ప్రతిష్ట చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను షురూ చేశారు. ఈ ఉదంతం లెక్క తేల్చటానికి ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్ని పరిశీలిస్తున్నారు. నిందితుల్నిత్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. మొగ్గలోనే ఇలాంటి ఆరాచకాల్ని కట్టడి చేయకుంటే.. ఏపీలో మాదిరే తెలంగాణలోనూ ఉన్మాద చర్యలు పెరిగే ప్రమాదం ఉందన్నది మర్చిపోకూడదు.