సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ పాపులర్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతకం పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ కోమాలోకి వెళ్లిపోవడం, బన్నీ అరెస్ట్ అవడం వంటి విషయాలన్నీ తెలిసినవే. సంధ్య థియేటర్ ఇష్యూని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం తో బన్నీ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఇరకాటంలో పడింది.
కేసులు, విచారణ అంటూ బన్నీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు రేపటి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి బాధితుడైన శ్రీ తేజ్ ను పరామర్శించేందుకు బుధవారం కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లారు. శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ కు రూ. 2 లక్షల చెక్కును ఆర్థిక సహాయంగా అందించారు.
ఆపై మీడియాతో మాట్లాడుతూ.. `శ్రీ తేజ్ కోలుకుంటున్నాడు. అతని ఆరోగ్యం కోసం వారం రోజుల్లో సొంత ఖర్చులతో మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తాను` అని వేణు స్వామి తెలిపారు. అలాగే అల్లు అర్జున్ జాతకంపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ` ఏదైనా జాతకాలు బట్టే జరుగుతాయి. అల్లు అర్జున్ జాతకంలో శని ప్రవేశించాడు. అందుకే ఇలా జరుగుతుంది. జాతకాలకు ఎవరూ అతీతులు కాదు.
వచ్చే ఏడాది మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు. అప్పటి వరకు కష్టాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ తర్వాత అంతా బానే ఉంటుంది. ఈ కలియుగంలో డబ్బు ఉన్నచోటే ప్రమాదం ఉంటుంది. అనేక సమస్యలు వస్తాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అనుకోకుండా జరిగిన ఘటన ఇది. ఎవరు కావాలని చేయలేదు` అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వేణు స్వామి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.