రామతీర్థంలో మాజీ కేంద్ర మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజును వైసీపీ నేతలు అవమానించిన ఘటన కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. విధులకు ఆటంకం కలిగించారని అశోక్ గజపతిపై కోదండరామాలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఘటనపై అశోక్ గజపతి స్పందించారు. జగన్ సర్కార్ తనను టార్గెట్ చేసిందని, దేవాదాయ చట్టం రాష్ట్రంలో లేకుంటే తనను చైర్మన్ పదవి నుంచి ఎప్పుడో తొలగించే వారని షాకింగ్ కామెంట్లు చేశారు.
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి వాడుతున్న భాష తనకు రాదని చురకలంటించారు. ఆలయ పునర్నిర్మాణ ముహూర్తం తేదీ నిర్ణయించే ముందు తెలియపరచమని చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వంలో దేవాదాయ అంశం భాగం కాదని సుప్రీంకోర్టు చెప్పినా జగన్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆనవాయితీలు, సంప్రదాయాలను వైసీపీ నేతలు మంటగలిపారని, పోలీసులకు చెబితే బూట్లు విప్పారని, కానీ, రాజకీయ నాయకులు మాత్రం అమర్యాదగా వ్యవహరించారని ఆరోపించారు.
సంప్రదాయాలు, ఆచారాలు ప్రకారమే ఆలయ ఛైర్మన్లు అవుతారని, అది ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఛైర్మన్లను ప్రభుత్వం నియమించదని, ఈ ప్రభుత్వం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని ఆరోపించారు. సంచయితకు సింహాచలం ఆలయం నుండి రూ.75,000 అలవెన్సుల క్రింద ఇచ్చారని, కానీ, సంచయితకు అలవెన్సులు ఇవ్వడం చట్టవ్యతిరేకమని అన్నారు. కోదండరాముని ఆలయం వ్యవహారం మాన్సాస్ ట్రస్టుకు సంబంధించినదని, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని నిలదీశారు.
తమ పూర్వీకులు 400 సంవత్సరాల కిందట ఆ ఆలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు. గతంలో తాను విరాళం ఇచ్చిన చెక్కును కూడా ఈవో స్వీకరించలేదని గుర్తు చేశారు. భక్తులు ఇచ్చిన కానుకలను స్వీకరించకపోవడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. మరోవైపు, నేడు రాత్రికి అశోక్ గజపతిని అరెస్టు చేసే అవకాశం ఉందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బుధవారం రాత్రే ఈవో ఫిర్యాదు చేయగా…ఈ విషయం ఈ రోజు ఉదయం బయటకు పొక్కింది.