ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముస్లింలను టార్గెట్ చేస్తూ.. చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ఈయన నోరు జారేశారని నెటిజన్లు చెబుతున్నారు. మావాళ్లే కండోమ్‌లు ఎక్కువగా వాడుతున్నారని ఓవైసీ చెప్పారు.
అక్కడితోనూ ఆగలేదు.. హిందువులకన్నా.. ఎక్కువగా `నిగ్రహం` పాటిస్తూ.. ఇంద్రియాన్ని వృధా చేస్తున్నారని ఓవైసీ చెప్పారు. ఇలా మాట్లాడుతున్నందుకు బాధగా ఉన్నా.. సిగ్గుపడడం లేదన్నారు. ఒక బలమైన అబద్ధాన్ని ఎదిరించాల్సి వచ్చినప్పుడు.. కొన్ని పర్సనల్ విషయాలను చెప్పడం తప్పుకాదన్నారు. దేశంలో ఎవరి జనాభా ఎక్కువగా పెరుగుతోందో.. లెక్కలు వేస్తే.. అప్పుడు ముస్లింల జనాభా ఎంత పెరిగిందో తెలుస్తుందని చెప్పారు. మోడీ అర్థరహితంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఏం జరిగింది?
గత నాలుగు రోజులుగా ప్రధాని మోడీ.. ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ దేశ సంపదను ముస్లింలకు పంచేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చెప్పిన.. మోడీకి కాంగ్రెస్ బలంగానే సమాధానం చెప్పింది. దీంతో ఆయన రూటు మార్చారు. రాజస్థాన్‌లో మాట్లాడుతూ.. ముస్లింలే జనాభా పెరగడానికి కారణమని వ్యాఖ్యానించారు. ఒక్కొక్క ముస్లిం కుటుంబంలో 10 నుంచి 15 మంది పిల్లలు కూడా ఉంటున్నారని.. వీరందరికీ.. సంపదను పంచేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు.
దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ ఇంకా నోరు విప్పకపోయినా.. ఓవైసీ మాత్రం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ముస్లింలే ఈ దేశంలో కండోమ్‌లు ఎక్కువగా వాడుతున్నారని.. నిగ్రహించుకుంటున్నారని చెప్పారు. ముస్లింలను.. దేశ ద్రోహులుగా చిత్రించి 2019లో విజయం దక్కించుకున్నారని.. ఇప్పుడు కూడా వారిపైనే ఏడుస్తున్నారని చురకలంటించారు. ఇది అసబద్ధ అబద్ధమని తేల్చిచెప్పారు. ఇప్పుడు ముస్లింల కుటుంబాల్లో ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉండడం లేదన్నారు.