తన పార్టీకి చెందిన 25 మందిని ఎంపీలుగా గెలిపిస్తే కేంద్రం మెడలు వంచైనా సరే ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని నాటి ప్రతిపక్ష నేత నేటి ఏపీ సీఎం జగన్ ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. ఒకే ఒక్క చాన్స్ అంటూ ప్రాధేయపడ్డ జగన్ మాటలు నమ్మిన జనం…వైసీపీకి చెందిన 23 మందిని ఎంపీలుగా గెలిపించారు. ఆ ఎంపీలంతా ఎప్పటిలాగే ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నారు కానీ, ప్రత్యేక హోదా మాత్రం రావడం లేదు. హోదా సంగతి దేవుడెరుగు….కనీసం విభజన చట్టంలోని హామీలను కూడా కేంద్రం నెరవేర్చడం లేదు. కేంద్రాన్ని వైసీపీ నేతలు, జగన్ నిలదీయకపోగా…చిత్తం ప్రభు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో, కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్….కేంద్ర ప్రభుత్వం ముందు చతికిలబడ్డారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనూ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రం మొండిచేయి చూపడంతో పాటు అరకొర నిధులు విదిల్చిచేతులు దులుపుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విరుచుకుపడ్డారు. జనాన్ని మోసం చేసే రెడ్డి జగన్ మోహన్ రెడ్డి మరోసారి రాష్ట్రాన్ని దగా చేశారని లోకేష్ మండిపడ్డారు. విభజనచట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన హామీలకు బాబాయ్ హత్య కేసుతో కేంద్రం చెల్లు చేసిందని దుయ్యబట్టారు.
25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా సాధిస్తానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన జగన్….చివరికి తన 31 కేసుల నుంచి తప్పిస్తే చాలు ప్రత్యేక హోదా ఊసెత్తనని చెప్పి 28 ఎంపీలను కేంద్రానికి తాకట్టు పెట్టారని లోకేష్ విమర్శించారు. బడ్జెట్లో నిధులు కేటాయించక్కర్లేదు కానీ, సహనిందితులైన అధికారులను తనకు కేటాయిస్తే చాలని కేంద్రం వద్ద జగన్ సాగిలపడ్డారని తీవ్ర స్థాయిలో లోకేష్ ధ్వజమెత్తారు. అప్పులు వాడుకోవడానికి అనుమతిస్తే చాలు..ఏ ప్రాజెక్టులివ్వకపోయినా ఫర్వాలేదని కేంద్రంతో జగన్ ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. బడ్జెట్లో ఏపీకి ఏమీ ఇవ్వని కేంద్రాన్ని ఏమీ అనలేని నిస్సహాయస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారని లోకేష్ విమర్శించారు.