ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ బలపరిచిన అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయిస్తున్నారని ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. కుదిరితే బలవంతపు ఏకగ్రీవం…కుదరకుంటే బెదిరించి నామినేషన్ విత్ డ్రా చేసుకోవడం….అదీకాకుంటే నామినేషన్ పత్రాలు లాక్కొని చించేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఫిర్యాదు చేసిన వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని, ఆ దరఖాస్తులను పరిశీలించాలని ఆర్వోలకు ఎన్నికల కమిషన్ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అటువంటి నామినేషన్లను పరిగణనలోకి తీసుకోవాలని, వారిని అభ్యర్థులుగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది.
నామినేషన్ వేసి స్క్రూట్నీలో ఆమోదం పొందిన అభ్యర్థుల నామినేషన్ బలవంతంగా విత్ డ్రా చేయిస్తే వారు ఆర్వోకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇటీవల హైకోర్టు ఆదేశాలను తన ఉత్తర్వుల్లో ఎస్ఈసీ పొందుపరిచింది. బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని పలు రాజకీయపక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్ఈసీ తెలిపింది.
కాగా, మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం పరిషత్ ఎన్నికల నగారా మోగనున్నట్టు తెలుస్తోంది. మార్చి 14 తర్వాత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో వాయిదాపడిన చోటు నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలా లేదంటే కొత్త నోటిఫికేషన్ ప్రకటించాలా అన్న విషయంలో న్యాయనిపుణులతో ఎస్ఈసీ సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.