రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. నిన్న తిట్టుకున్నవారు.. నేడు చేతులు కలపొచ్చు. నేడు కలిసి ఉన్నవాళ్లు.. రేపు విడిపోనూ వచ్చు. ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో సర్వసాధారణం. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి రాజకీయం కనిపిస్తున్నా.. ఇవి ఒకరకంగా అసాధారణం. ఎందుకంటే.. నిన్నటి మొన్నటి వరకు.. కేవలం నాయకులు మాత్రమే ఇలా.. జంపింగులు చేసుకునే వారు. కానీ.. ఇప్పుడు పార్టీల కీలక నేతలు సైతం.. రాజకీయాలను యూటర్న్ తిప్పేస్తున్నారు.
తాజాగా ఒక ఇంగ్లీష్ పత్రిక రాసిన కథనం మేరకు.. ఏపీలో గడిచిన ఐదేళ్ల క్రితం ఉన్న రాజకీయాలు ఇప్పు డు అనూహ్యంగా తిరగబడ్డాయి. ఇది ఎవరికి మేలు చేస్తుంది? ఎవరిని ఇబ్బంది పెడుతుంది? అనే కోణం లో సాగిన ఈ కథనంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గత 2019 ఎన్నికల్లో జగన్ కోసం.. జగన్ చేత అన్నట్టుగా రాజకీయాలు చేసిన షర్మిల.. ఎవరూ ఊహించను కూడా ఊహించని విధంగా.. ఇప్పుడు ఆయనకు ఎగస్పార్టీ అయ్యారు. ఇది కీలక పరిణామం.
అదేసమయంలో 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఒంటరిగా పనిచేశాయి. ఎవరికి వారుగా ప్రజల్లోకి వెళ్లారు. భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ.. ఐదేళ్లు గడిచేలోపే.. రెండు పార్టీలూ చేతులు కలిపా యి. అధికార పార్టీ వైసీపీని గద్దె దింపేయాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఇదొక అనూ హ్య పరిణామం. అదేసమయంలో అధికార పార్టీ వైసీపీ గత ఎన్నికలకు ముందు.. సంక్షేమ కార్యక్రమాలు.. పథకాలపై ఆధారపడి ఎన్నికలకు వెళ్తే.. ఇప్పుడు వ్యూహాత్మకంగా సామాజిక వర్గాలను ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్తున్నట్టు సదరు పత్రిక పేర్కొంది.
ఇక, ఈ మార్పులు.. పరిణామాలు.. వంటివి పార్టీలకు ఎంత వరకు మేలు చేస్తాయన్న విషయానికి వస్తే.. ఉచితాలు, సెంటిమెంటు వైపు ప్రజలు మొగ్గు చూపితే.. టీడీపీ-జనసేన కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతారని పత్రిక పేర్కొంది. అలా కాదు.. సామాజిక వర్గాల ఆదారంగా ముందుకు సాగితే.. మాత్రం వైసీపీ వైపు నిలబడే అవకాశం ఉందని తెలిపింది. ఇక, ఇతర ఫ్యాక్టర్లు ఉన్నప్పటికీ.. మెజారిటీగా మాత్రం ఉచితాలు.. వర్సెస్ సామాజిక ఈక్వేషన్ల మధ్యే ఈ ఎన్నికలు ప్రధానంగా చక్రం తిప్పుతున్నాయని వివరించింది. అయితే.. ఈ ఐదేళ్లలో జరిగిన మార్పును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పత్రిక పేర్కొనడం గమనార్హం.