చంద్రబాబు కంటే నేనేమీ ఎక్కువ అప్పులు చేయలేదంటూ సీఎం జగన్ కొద్ది రోజుల క్రితం చేసిన ప్రకటనపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. అయినా, మేం జనం కోసమే అప్పులు చేశామంటూ జగన్ అండ్ కో ప్రచారం చేసుకుంటూ ఉండడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. మూడేళ్ల పాలనలో జగన్ దాదాపు ఐదున్నర లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో ముచ్చటగా మూడు లక్షల కోట్లకు లెక్కలు లేవని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
అంతేకాదు, జగన్ చేసిన అప్పుల చిట్టాను గణాంకాలతో సహా వారు బట్టబయలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు చెబుతున్నవన్నీ అబద్ధాలని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ కు షాకిచ్చే గణాంకాలను ఆయన ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న దువ్వూరి కృష్ణ వెల్లడించారు. 2022 ఏడాది మార్చి నాటికి ఏపీ మొత్తం అప్పులు రూ.4,98,799 కోట్లకు చేరుకున్నాయని షాకింగ్ విషయం చెప్పారు.
అయితే, ఏపీ అప్పులను 2021-22 ఏడాదిలో రూ.25,194 కోట్ల మేర తగ్గించామని చెప్పారు. ఇక, ఏపీ అప్పులపై ప్రచారం చేస్తున్న కేంద్రం తాను చేస్తున్న అప్పులను కూడా వెల్లడించాలంటూ కొత్త లాజిక్ ను బయటపెట్టారు. 2019-20లో కేంద్రం అప్పులు దేశ జీడీపీలో 50.90 శాతానికి చేరుకున్నాయని, ఏడాదిలోనే కేంద్రం రూ.1,02,19,067 కోట్ల మేర అప్పులు చేసిందని అన్నారు. 2021-22 లో కేంద్రం అప్పులు రూ.1.35 లక్షల కోట్ల మేర పెరిగాయని తెలిపారు.
ఉచిత పథకాలను కేంద్రం ఆర్థిక కోణంలో చూస్తోందని, ఏపీ మాత్రం ఆ పథకాలను సామాజిక పెట్టుబడి కోణంలో చూస్తోందని తెలిపారు. ఉచిత పథకాలు ప్రమాదకరమంటూ ప్రధాని మోడీ చేసిన కామెంట్ల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఏపీ అప్పులు ఎక్కువైపోతున్నాయని , కాస్త జాగ్రత్త పడండని మోడీ మొత్తుకుంటుంటే…..మేమే కాదు మీరు కూడా అప్పులు చేస్తున్నారంటూ చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఏపీ ప్రభుత్వం కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్నట్లుగా దాదాపు ఐదు లక్షల కోట్లు అప్పులు చేసిందని అధికారికంగా ఒప్పుకోవడం మాత్రం అభినందించదగ్గ విషయమే. మరి, ఈ అధికారిక అప్పులపై వైసీపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
Comments 1