జనసేన పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఘాటుగా స్పందిస్తున్నారు. పవన్‌ను మంత్రులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న పవన్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కారు కొత్త అప్పుల కోసమే సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలనుకుంటోందని ఆయన విమర్శించారు.
ప్రైవేటు వ్యక్తులు తీసే సినిమాపై ప్రభుత్వ ఆధిపత్యం ఏమిటని ప్రశ్నించారు. ఓ సందర్భంలో ఆయన చివాలెత్తిపోయారు. అరేయ్ సన్నాసుల్లారా… దద్దమ్మల్లారా.. ఇవి దోచుకున్న డబ్బులు కాదు. కష్టపడితే వచ్చే డబ్బులు. కాంట్రాక్టులతో, అవినీతితో సంపాదించింది కాదు. పన్నులు కూడా కడుతున్నామని మండిపడ్డారు.
పవన్ వ్యాఖ్యలపై మంత్రులు మూకుమ్మడి దాడికి దిగారు. తాము సన్యాసులమైతే పవన్ రుషి పుంగవుడా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆన్లైన్ విధానాన్ని సినీ పెద్దలు అంగీకరించారని తెలిపారు. ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది కదా అని చెలరేగిపోతే … ఎలా కట్టడి చేయాలో తమకూ తెలుసన్నారు. ‘మాకు తాట తీస్తాడా.. చూస్తాం’ అని హెచ్చరించారు. సినీ పరిశ్రమ అంటే పవన్ కల్యాణ్ ఒక్కరేనా? అని బొత్స సూటిగా ప్రశ్నించారు.
పవన్‌కల్యాణ్ నటించినా, సంపూర్ణేష్ బాబు నటించినా కష్టం ఒకటేనని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ఎద్దేవాచేశారు. ఆన్లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయం? దాని వల్ల జరిగే నష్టం ఏమిటి? అని అనిల్ ప్రశ్నించారు. అకౌంటబులిటీ రావాలన్నదే సీఎం ఆలోచన అని చెప్పారు. ఆన్లైట్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపారని తెలిపారు.
సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుందని, ఇది ఎంత వరకు సబబు అని మంత్రి అనిల్ ప్రశ్నించారు. పారదర్శకత కోసమే ఆన్లైన్ పోర్టల్ విధానమని తెలిపారు. అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే తమ ఉద్దేశమని అనిల్‌కుమార్ యాదవ్ ప్రకటించారు.
ఇన్ని రోజులు మౌనంగా పవన్ ఒక్కసారి ప్రభుత్వం ఘాటు విమర్శలు చేయడం పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు. సన్నాసుల్లా… దద్దమ్మల్లా అని ప్రభుత్వ పెద్దలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో పవన్ వర్సెస్ ప్రభుత్వంగా మారిపోయిందనే వాదన కూడా తెరపైకి వస్తోంది.
ఇప్పటివరకు ఇద్దరు మంత్రులు మాత్రమే పవన్ వ్యాఖ్యలపై రియాక్టయ్యారు. ఇక ముందు ఇతర మంత్రులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. పవన్ వ్యాఖ్యలను వదిలేస్తారా లేకుంటే తీవ్రంగా పరిగణిస్తారా అనేది చూడాలి.