రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై ఏర్పడిన వివాదానికి ముడిపడకపోగా.. మరింత ముదిరింది. స్థానిక ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషన్.. అలా వద్దని.. ప్రస్తుతం.. కరోనా తీవ్రత తగ్గలేదని, మరోవైపు కొవిడ్ టీకా ఇచ్చే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం బిజీగా ఉందని .. ఎన్నికలను వాయిదా వేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ అనూహ్యంగా షెడ్యూల్ విడుదల చేయడం, ప్రభుత్వం దీనిని సవాల్ చేస్తూ.. హైకోర్టుకు వెళ్లడం తెలిసిందే. దీనిపై హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం విచారణ జరపడం, షెడ్యూల్‌ను సస్పెండ్ చేయడం తెలిసిందే. ఇక, సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఎన్నికల కమిషన్ అంతే వేగంగా డివిజన్ బెంచ్‌లో సవాలు చేయడం తెలిసిందే.
ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఇరు పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుంటూనే.. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది అంతేకాదు… ఈ పిటిషన్‌పై విచారణను రెగ్యులర్ కేసులతో పాటు విచారిస్తామని పేర్కొంది. ప్రస్తుతం.. కథ ఇప్పటికే జరిగింది.
కానీ, డివిజన్ బెంచ్ విచారణ సందర్భంగా.. కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫు వాదనలు.. అత్యంత ఆసక్తిగా ఉన్నాయి. ఎన్నికలు నిలిపివేస్తే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుందని కమిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. నిజానికి ఈ వాదన అత్యంత కీలకం. అంతేకాదు, సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఈ నెల 18 వరకు అమల్లో ఉంటే ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులు, ఓటర్లలో గందరగోళం తలెత్తుతుందని తెలిపారు.
అలాగే, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల విషయంలో కొంత పురోగతి ఉందని, నోటిఫికేషన్ అమలు నిలుపుదల చేయడం వల్ల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ నిలిచిపోతుందని అన్నారు. విచారణను 18వ తేదీకి వాయిదా వేయడం వల్ల షెడ్యూల్ తేదీ మరింత దగ్గరవుతుందని, సింగిల్ జడ్జి ఉత్తర్వులు చట్టం నిర్దేశించిన సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణను ధర్మాసనమే ప్రారంభించిందని తెలిపారు. రాజ్యాంగంలోని 243 అధికరణ మేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసీపై ఉందని, ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశాక నియమావళిని రద్దు చేయజాలరని తెలిపారు.
ఇక, సర్కారు వైపు వాదనలు చూస్తే.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులతో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగదని ఏజీ తెలిపారు. విచారణను ఈ నెల 18కి వాయిదా వేయడం వల్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడదన్నారు. ఒకవేళ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం రద్దుచేస్తే.. ఓటర్ల జాబితా సిద్ధం కాలేదనే కారణంతో ప్రభుత్వం మరింత సమయం కోరదని కూడా చెప్పారు.
దీంతో ప్రస్తుతానికి ప్రభుత్వం వైపు చూస్తే.. కొంత ఉపశమనం కనిపించినా.. దీనిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. 18నాటి రెగ్యులర్ విచారణలో హైకోర్టు ఏం చెబుతుందనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. హైకోర్టు ఏం చెప్పినా.. అక్కడితో ఈ రగడకు ఫుల్ స్టాప్ పడదు. అటు సర్కారు, ఇటు ఎన్నికల కమిషన్లు సర్దుకోవు. ఎందుకంటే.. కోర్టు ఎలాంటి తీర్పు చెప్పినా.. ఒక పక్షానికి రుచించవచ్చు.. మరో పక్షానికి రుచించకపోవచ్చు. దీంతో సదరు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లడం ఖాయం.