ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కంపెనీలను, సంస్థలను ప్రోత్సహించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ బిజినెస్ నినాదంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే విశాఖలో ప్రముఖ ఐటీ కంపెనీ టిసిఎస్ తమ సంస్థను నెలకొల్పేందుకు ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ విశేష కృషి చేశారు. 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించే టీసీఎస్ సంస్థ విశాఖలో ఏర్పాటు కానుంది. ఈ క్రమంలోనే ఏపీలో మరిన్ని ఐటీ కంపెనీల పెట్టుబడులు ఆకర్షించేందుకు నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు.
లాస్ వేగాస్ నగరంలో అక్టోబర్ 29,30 తేదీలలో జరగనున్న ‘ఐటీ సర్వ్ సినర్జీ’ 9వ వార్షిక సదస్సుకు నారా లోకేష్ హాజరు కాబోతున్నారు. అక్టోబరు 25 నుంచి నవంబరు 1వ తేదీ వరకు లోకేేష్ అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడులు పెట్టేలా పలు ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులతో లోకేష్ భేటీ కాబోతున్నారు. డల్లాస్ లో జరగబోయే బహిరంగ సభలో లోకేష్ పాల్గొనబోతున్నారు. ఈ సభకు ఎన్నారై టీడీపీ నేతలు, టీడీపీ అభిమానులు, ఎన్నారైలు భారీ సంఖ్యలో హాజరు కాబోతున్నారు.
రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ పురోగతికి వేగంగా చర్యలు తీసుకుంటోన్న చంద్రబాబు సర్కార్..అమెరికాలోని కంపెనీలను ఆకర్షించే పనిలో పడింది. ఈ క్రమంలో లోకేష్ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా లోకేష్ అమెరికా పర్యటనలకు వెళ్లిన ప్రతిసారి ఏపీలో పదుల సంఖ్యలో ఐటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఈసారి కూడా లోకేష్ అమెరికా పర్యటన తర్వాత ఏపీకి భారీగా ఐటీ రంగంలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.