- ఏపీఎస్డీసీ ద్వారా రుణాలు తేవడంపై ఆర్బీఐ ఆగ్రహం
- కార్పొరేషన్లకు అప్పులివ్వొద్దు, కట్టే స్తోమత ఉందో లేదో చూడాలి
- బడ్జెట్ నుంచి చెల్లిస్తామంటే కుదరదు, అన్ని బ్యాంకులకు ఆర్బీఐ సర్క్యులర్
జగన్ సర్కార్ అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతున్న వైనాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తప్పుబట్టింది. రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీఎస్డీసీ) పేరుతో అరాచకాలు చేస్తోందని ధ్రువీకరించింది. పైసా ఆదాయం లేని ఆ కార్పొరేషన్ ద్వారా అప్పులు తేవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3)కి విరుద్థమని, మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించి దానిని ఖజానాకు కాకుండా ఏపీఎస్డీసీకి మళ్లించడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని స్పష్టం చేసింది.
ఆర్టికల్ 293(3) ప్రకారం.. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోకూడదు. కేంద్రం అనుమతితో తీసుకున్న రుణాలను రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాలి. కానీ ఏపీఎస్డీసీ విషయంలో కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఖజానాకు రావలసిన మద్యం ఆదాయాన్ని ఆ కార్పొరేషన్‌కు మళ్లించి రూ.25,000 కోట్ల అప్పు తెచ్చుకోవడానికి బ్యాంకులతో జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.23,200 కోట్ల అప్పులు తెచ్చింది.
ట్విస్ట్ ఏంటంటే ఆ కార్పొరేషన్‌కు పైసా ఆదాయం లేదు. నయాపైసా ఆస్తి లేదు. అందుకే విశాఖలోని కలెక్టర్ కార్యాలయం, 2 తహసీల్దార్ కార్యాలయాలు, పాలిటెక్నిక్ కాలేజీలు, పార్కులు, వందల ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆ కార్పొరేషన్‌కు రాసిచ్చి, దాని ద్వారా ఆ ఆస్తులన్నింటిని బ్యాంకులకు తనఖా పెట్టారు. ఇది సరిపోదన్నట్టు మద్యం అమ్మకాలపై ఏఆర్టీ విధించి ఆ మొత్తాన్ని కార్పొరేషన్‌కు మళ్లించి దానినే ఆదాయంగా చూపి రూ.23,200 కోట్ల అప్పులు తెచ్చారు.
ప్రభుత్వాలు మారితే విధానాలు మారడం సహజం. ఏపీలో కూడా మద్యం విధానం మారితే ఆ బ్యాంకుల పరిస్థతేంటి..? ఆ అప్పు ఎవరు చెల్లిస్తారు ? దీనిని బ్యాంకులు సరిగ్గా అంచనా వేయలేదని ఆర్బీఐ తన సర్క్యులర్‌లో పేర్కొంది.
ఎస్బీఐకి అక్షింతలు
ఏపీఎస్డీసీ ఏర్పాటు, దాని ద్వారా తెచ్చిన అప్పులను కేంద్రం ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ తప్పుబట్టింది. కార్పొరేషన్లకు అప్పులిచ్చేముందు బ్యాంకులు ముందూ వెనుకా ఆలోచించుకోవాలని హెచ్చరించింది. దీంతో ఎస్బీఐలోని 11 మంది వాటాదారులు ఈ కార్పొరేషన్‌పై వివరణ ఇవ్వాలని ఆ బ్యాంకును కోరడం, ఇకపై ఇలాంటి వాటిని సమర్థించబోమని తెగేసి చెప్పడంతో ఏపీఎస్డీసీ అప్పులకు పూర్తిగా బ్రేక్ పడింది. చివరి విడతగా ఇవ్వాల్సిన రూ.1,800 కోట్లను ఎస్బీఐ ఇవ్వలేదు.
రేటింగ్స్ సంస్థలకూ పాత్ర
బ్యాంకులు ఇలాంటి భారీ అప్పులు ఇవ్వడానికి రేటింగ్స్ సంస్థలు ఇచ్చే నివేదికనే ప్రాతిపదికగా తీసుకుంటాయి. అయితే, ఆ రేటింగ్ సంస్థల్లో నిపుణులు ఉంటారు. ఒక కార్పొరేషన్ లేదా ఒక ప్రాజెక్టు ఎంత వరకు వయబుల్‌గా ఉంటుంది.. స్థిరమైన రాబడి ఉంటుందా.. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది.. ఆస్తులు, అప్పుల వివరాలు.. అసలు ఆ ప్రాజెక్టుకు అప్పివ్వచ్చా. ఇస్తే ఎంత ఇవ్వొచ్చనేది ఆ రేటింగ్ సంస్థలిచ్చే రేటింగ్ ఆధారంగా బ్యాంకులు తెలుసుకుంటాయి.
అయితే ప్రాజెక్టు లేదా కార్పొరేషన్ లేదా ఒక సంస్థను చూసి ఎంత అప్పివ్వచ్చు, రీపేమెంట్ చేయగలుగుతారా లేదా అనేది అనుభవజ్ఞులైన బ్యాంకర్లు కూడా అంచనా వేయగలుగుతారు. ఇందుకు బ్యాంకులకు ఆర్బీఐ కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనల ప్రకారమే బ్యాంకులు అప్పులివ్వాలి. కానీ ఏపీఎస్డీసీ విషయంలో కేవలం ఇండియా రేటింగ్స్ అనే రేటింగ్స్ సంస్థ ఇచ్చిన నివేదిక అధారంగానే బ్యాంకులు రూ.23,200 కోట్ల అప్పులిచ్చేశాయి. దీనిని ఆర్బీఐ తప్పుబట్టింది. బ్యాంకులు వారి టార్గెట్ల కోసం, అమ్యామ్యాల కోసం రాజీ పడడం వల్లే ఇలా జరిగీందని, ఆర్బీఐ నిబంధనలు పాటిేస్త ఇలాంటి ఘోరాలు జరిగేవి కాదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
రెండు చోట్లా ఇండియా రేటింగ్సే..!
ఏపీఎస్డీసీ ద్వారా అప్పులు తెచ్చే ప్లాన్ బెడిసికొట్టడంతో జగన్ సర్కార్ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ను తెరపైకి తెచ్చింది. అయితే వివాదాస్పద ఏపీఎస్డీసీకి, ఈ బేవరేజెస్ కార్పొరేషన్‌కి ‘ఏఏ’ రేటింగ్స్ ఇచ్చిన సంస్థ ఇండియా రేటింగ్సే కావడం విశేషం. రెండు కార్పొరేషన్లది రాజ్యాంగ విరుద్థ విధానమే. ఏపీఎస్డీసీకి పైసా ఆదాయం లేదు. బేవరేజెస్ కార్పొరేషన్‌కు ప్రభుత్వ మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నందుకు గాను ప్రభుత్వం ఖర్చులు, సర్వీసు కింద కొంత మొత్తం చార్జీలుగా చెల్లిస్తుంది. ఇది చాలా తక్కువ.
వేల కోట్ల అప్పులు తెచ్చుకుని చెల్లించేంత ఆదాయమైతే లేదు. పైగా ఈ కార్పొరేషన్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిర్వహిస్తాయంటూ జగన్ సర్కార్ అసెంబ్లీకి లేని అధికారం ఉపయోగించి చట్టాలు చేసింది. సంక్షేమ పథకాలకు బ్యాంకులు అప్పులివ్వడం ఎక్కడైనా ఉందా? అభివృద్థి ప్రాజెక్టులకే ఇస్తాయి. ఇవన్నీ తెలిసి కూడా ఇండియా రేటింగ్స్ ఆ రెండు కార్పొరేషన్లకు ఏఏ రేటింగ్ ఇవ్వడం, ఎస్బీఐ పనిగట్టుకుని అప్పులివ్వడం, ఇప్పించడం మరింత వివాదాస్పదం.
బడ్జెట్ నుంచి చెల్లిస్తున్నట్లే..
ఏపీఎస్డీసీ గానీ, బేవరేజెస్ గానీ, ఏపీఆర్డీసీ గానీ, ఏపీ ేస్టట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ గానీ, పౌరసరఫరాల సంస్థ గానీ, మార్క్‌ఫెడ్ గానీ.. ఇంకా పదుల సంఖ్యలో ఉన్న ఇతర కార్పొరేషన్ల ద్వారా గానీ.. జగన్ సర్కారు బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు తెచ్చి అవసరాలకు వాడేసింది. ఆ కార్పొరేషన్లకు చెల్లించే సామర్థ్యం లేదు కాబట్టి వాటిని బడ్జెట్ నుంచి చెల్లిస్తున్నారు.
బడ్జెట్లో నేరుగా అప్పుల తిరిగి చెల్లింపుల కోసం కేటాయింపులు అని పెట్టకుండా ఆయా కార్పొరేషన్లకు గ్రాంట్ ఇన్ ఎయిడ్లని పెడుతున్నారు. అంటే బడ్జెట్ నుంచి చెల్లిస్తున్నట్టే. కార్పొరేషన్లకు కట్టే స్తోమత లేదన్న విషయం బ్యాంకులు ఎందుకు గుర్తించడం లేదని ఆర్బీఐ నిలదీసింది. గుర్తించకుండా అప్పులివ్వడం కుదరదని.. ఆ అప్పులను బడ్జెట్ నుంచి చెల్లిస్తామంటే నిబంధనలు అంగీకరించవని సర్క్యులర్‌లో హెచ్చరించింది.