ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. దయానీయ పరిస్థితులు నెలకొన్నాయని జగన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని దేశం మొత్తానికి తెలిసేలా ఈనెల 24న ఢిల్లీలో వైసీపీ ధర్నా చేస్తుందని కూడా జగన్ ప్రకటించారు. అయితే తాజాగా అమరావతిలో మీడియాతో మాట్లాడిన హోమ్ మంత్రి అనిత.. జగన్ వ్యాఖ్యలపై స్పందించారు.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ పదే పదే అంటున్నారు.. వాటి వివరాలు ఆయన ఇవ్వగలరా? అంటూ అనిత ప్రశ్నించారు. రాజకీయ హత్యల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ తెలపాలని.. లేకుంటే తప్పుడు ఆరోపణలు చేస్తునందుకు ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
రాజకీయ హత్యలు కేవలం నాలుగు మాత్రమే జరిగాయని.. బాధితుల్లో ముగ్గురు టీడీపీ నాయకులే ఉన్నారని అనిత తెలిపారు. మైకు ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకునేందుకే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీలో జగన్ ధర్నా ప్లాన్ చేస్తున్నారని.. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని జగన్ కు అనిత సవాల్ విసిరారు. అసెంబ్లీలో శాంతి భద్రతలపై తాము ప్రవేశపెట్టే శ్వేతపత్రంపై జగన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో నేరాలు, హత్యలు, అత్యాచారాలపై సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదు..? లా అండ్ ఆర్డర్, గంజాయిపై ఒక్కసారైనా ఎందుకు సమీక్ష జరపలేదు..? అని అనిత ప్రశ్నలు వర్షం కురిపించారు. ఒకవేళ ఏపీలో శాంతి భద్రతల అంశంపై మాజీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తే తానూ కూడా అక్కడికే వెళ్లి తేల్చుకుంటామని..ఆయన అకృత్యాలు బయటపెడతామని అనిత పేర్కొన్నారు.