వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే గోరంట్ల వీడియో మార్ఫింగ్ చేసిందా లేదా నిజమైనదా అని తెలియక ముందే అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. అసలు ఆ వీడియో ల్యాబ్ కు చేరక ముందే ఫకీరప్ప నిర్ధారణకు రావడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ నగ్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించి నిజం నిగ్గు తేల్చాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఏపీ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాల్లో వైసీపీ నాయకులు, మద్దతుదారుల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వైసీపీ నేతల్ని కాపాడేందుకు ఓ వర్గం పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు.
‘దిశ’ చట్టం లేదని, కానీ, ఏపీ ప్రభుత్వం ఆ పేరుతో మహిళల్ని మోసం చేస్తోందని ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న అఘాయిత్యాలపై కేంద్ర హోం శాఖ సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. గోరంట్ల మాధవ్ ది మార్ఫింగ్ వీడియో అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పడం మహిళలను విస్మయానికి గురిచేసిందన్నారు.
నేరస్థుల్ని తప్పించడంలో వైసీపీ ప్రభుత్వం, పోలీసులు, అధికారుల పాత్రపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాను కోరారు. దీంతోపాటు ఏపీ డీజీపీకి ఆయన మరో లేఖ రాశారు. వీడియో క్లిప్‌పై విచారణ జరుగుతుండగానే వాస్తవాల్ని వక్రీకరించి వివరాలను వెల్లడించడం పోలీసుల ఎథిక్స్, స్టాండింగ్ ఆర్డర్లకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఎస్పీ ఫకీరప్ప కావాలనే ఇలా చేస్తున్నట్టుగా ఉందని, ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.