మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం బకాయిల చెల్లింపుల విషయంలో ఏపీ ప్రభుత్వంపై కొంతకాలంగా హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చుతున్న సంగతి తెలిసిందే. పిటిషనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ తాము పదేపదే ఆదేశించినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంటోందని హైకోర్టు పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందని, 2 వారాల్లోపు 500 మంది పిటిషనర్లకు డబ్బు చెల్లించాల్సిందేనని గత విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది.
ఈ విషయంలో ఆర్థిక శాఖాధికారులు కోర్టు ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణ కింద చర్యలు ప్రారంభిస్తామని కూడా గతంలో హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. అయినా సరే జగన్ సర్కార్ తీరు మారలేదు. దీంతో, తాజాగా ఉపాధి బిల్లుల చెల్లింపుల విషయంలో జగన్ సర్కార్ తీరుపై హైకోర్టు మరోసారి విరుచుకుపడింది. 500 మంది పిటిషనర్లకుగాను కేవలం 25 మంది పిటిషనర్లకే పూర్తి బిల్లులు చెల్లించడం ఏమిటని హైకోర్టు మండిపడింది. విజిలెన్స్ విచారణ పేరుతో బిల్లుల చెల్లింపును ఎంతకాలం సాగదీస్తారని నిలదీసింది.
పిటిషనర్లు చేసిన పనుల విషయంలో విచారణ జరుపుతున్నప్పుడు కనీసం వారికి నోటీసులు ఇవ్వకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.తమ ఉత్తర్వులను ఉల్లంఘించిన అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వం జమచేసిన నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించే విషయంలో సహకరించని సర్పంచ్‌లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత నెల 23న ఇచ్చిన తమ ఆదేశాల ప్రకరారం ఎంత మంది పిటిషనర్లకు బిల్లులు చెల్లించారో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
అందుకు తమకు 2వారాల సమయం ఇవ్వాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. వారం రోజుల్లో మిగతా పిటిషనర్లకు పూర్తి బిల్లులు చెల్లించాలని తాజా డెడ్ లైన్ విధించింది. మరి, ఈ డెడ్ లైన్ ను జగన్ లైట్ తీసుకుంటారా లేక బిల్లులు చెల్లిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.