ఏపీ లో పింఛన్ దారులకు సర్కార్ ఓ శుభవార్త చెప్పింది. ఇకపై పింఛన్ల బదిలీకి అవకాశం కల్పించబోతోంది. ఎన్డీయే కూటిమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పెన్షన్ను రూ. 4 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. పైగా ఏప్రిల్ నెల నుంచి పెంచిన పింఛన్లను అమలు చేసింది. అలాగే పింఛన్లను లబ్దిదారులకు నేరుగా ఇంటి వద్దే అందిస్తున్నారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
సామాజిక పింఛన్ల బదిలీకి గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఆప్షన్ను గ్రామ, వార్డు సచివాలయాలల్లో అందుబాటులో తెచ్చింది. పింఛన్ దారుల్లో కొందరు ఉపాధి కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వారంతా పెన్షన్ కోసం ప్రతినెలా 1వ తారీఖున స్వగ్రామానికి రావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పెన్షన్ దారులకు ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగా నివాసం ఉన్న ప్రాంతంలోనే పింఛన్ పొందేందుకు వేసులుబాటు కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.
అందుకోసం లబ్దిదారులు సచివాలయంలో పింఛన్ ట్రాన్స్ఫర్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలోని ఇతర ప్రాంతాలకు పింఛన్ బదిలీ చేసుకోవాలనుకుంటే.. పింఛన్ దారు ఐడీతో పాటుగా ఎక్కడికైతే ట్రాన్స్ ఫర్ చేయాలో ఆ జిల్లా, మండలం, సచివాలయం వివరాలను స్వగ్రామంలోని సచివాలయంలో అందించాలని తెలిపారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై పింఛన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.