సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ సర్కార్ నుంచి ఇళ్లు లేని పేదవారికి తీపి కబురు అందింది. పీఎం ఆవాస్ యోజన – ఎన్టీఆర్ నగర్ పథకం కింద వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు ఇవ్వనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో భాగంగానే గృహ నిర్మాణం కోసం 2024-25 ఆర్థిక ఏడాదికి గాను రూ. 4,012 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు సోమవారం అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. 2029 నాటికి పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వం లక్ష్యమని పయ్యావుల కేశవ్ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పేద వారికి 25 లక్షల ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కూటమి సర్కార్ నిర్ణయించిందని పయ్యావుల పేర్కొన్నారు.
కాగా, వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఏపీ అసెంబ్లీ బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం నాడు అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలు సాగుతాయి. ఈ నేపథ్యంలో సభ్యులందరూ బడ్జెట్ పై సంపూర్ణ అవగాహనతో రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకు డుమ్మా కొట్టడంతో.. తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.